National

ఉమ్మడి కేసులపై క్లారిటీ ఇవ్వని కేంద్రం

విజయవాడ, డిసెంబర్ 28, (లోకల్ న్యూస్ )
ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఏర్పాటు ఉత్తర్వులు విడుదలయ్యాయి. ఈ మేరకు ఉమ్మడి హైకోర్టును ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ మధ్య రెండుగా విభజిస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ బుధవారం ఆదేశాలు జారీచేశారు. జనవరి 1 నుంచి అమరావతి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు కార్యకలాపాలు ప్రారంభిస్తుందని అందులో స్పష్టం చేశారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న న్యాయస్థానం తెలంగాణ రాష్ట్ర హైకోర్టుగా సేవలు కొనసాగిస్తుందని పేర్కొన్నారు.
రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 214 ప్రకారం ప్రతి రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్టు ఉండాలన్న నిబంధన మేరకు ఆంధ్రప్రదేశ్‌లో కొత్త హైకోర్టు ఏర్పాటు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ విభజనపై ఉమ్మడి హైకోర్టులో గందరగోళం నెలకొంది. రాష్ట్రపతి ఇచ్చిన ఉత్తర్వుల పై క్లారిటీ లేక, రెండు రాష్ట్రాల న్యాయవాదులు గందరగోళానికి లోనయ్యారు. ఉమ్మడి కేసుల పై స్పష్టతపై లేదని న్యాయవాదులు వాదిస్తున్నారు. అలాగే సిబ్బంది, దస్త్రాల విభజన జరగలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఏపీలో కొత్త భవనాలు ఇంకా సిద్ధం కాలేదని న్యాయవాదులు చెబుతున్నారు. అక్కడ సదుపాయాలకి, ఇంకా నెల, రెండు నెలల సమయం పడుతుందని అంటున్నారు. ఈ నాలుగు రోజుల్లో ఏ పని అవ్వదని అంటున్నారు. దీంతో చీఫ్ జస్టిస్ బెంచ్‌ దిగి తన చాంబర్‌లోకి వెళ్లిపోయారు. అటు హైకోర్టు ఆవరణలోనూ విభజనపై న్యాయవాదుల మధ్య చర్చోపచర్చలు జరుగుతున్నాయి.
రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌  గెజిట్‌ నోటిఫికేషన్‌ ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు కొత్తగా హైకోర్టును అమరావతిలో ఏర్పాటు చేశారు. ఇక ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న హైకోర్టు భవనంలోనే తెలంగాణ హైకోర్టు పనిచేస్తుంది. రెండు ఉన్నతస్థాయి కోర్టులూ జనవరి 1 నుంచి విడివిడిగా పనిచేస్తాయి. ఉమ్మడి హైకోర్టుకు మంజూరు చేసిన మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 61. అందులో ఏపీకి 37, తెలంగాణకు 24 విభజించారు. ఏపీకి కేటాయించిన వారిలో 28 మంది శాశ్వతన్యాయమూర్తులు, తొమ్మిది మంది అదనపు న్యాయమూర్తులు ఉంటారు.
తెలంగాణ హైకోర్టులో ఈ సంఖ్య 18, 6గా ఉంటుంది. ప్రస్తుతం హైకోర్టు విభజన అయ్యే నాటికి ఉమ్మడి కోర్టులో 27 మంది సేవలందిస్తున్నారు. అందులో ఏపీకి 14, తెలంగాణకు 10 మంది న్యాయమూర్తులను కేటాయించారు. ముగ్గురిపై ఇంకా కొలీజియం నిర్ణయం తీసుకుని కేటాయించాల్సి ఉంది. ఇప్పటివరకు కేటాయించిన న్యాయమూర్తుల సంఖ్యను బట్టిచూస్తే ఏపీలో 23, తెలంగాణలో 14 జడ్జీల పోస్టులు భర్తీ చేయాల్సి ఉంటుంది.

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close