social

సిరులను తెచ్చే దీపావళి

ఆన్ లైన్ పాఠకులందరికి దీపావళి శుభాకాంక్షలు

           పంచభూతాలలో ప్రధానమైనది అగ్ని. ఈ అగ్ని సకల ప్రాణ కోటి మనుగడుకు ఉపకరించే కాంతిని అందిస్తోంది. దీపాల వెలుగును సరిగ్గా గమనిస్తే.. నీలం, పసుపు, ఎరుపు, రంగులు కనిపిస్తాయి. ఈ మూడు రంగులు సత్వా, రజో, స్తమ గుణాలకు ప్రతీకలుగా వేదాలు చెబుతాయి. ఈ మూడు గుణాలు జగత్తును పాలించే లక్ష్మీ, పార్వతి, సరస్వతిదేవిగా పురాణాలు చెబుతున్నాయి. అంతటి మహత్యం ఉన్న దీపాన్ని వెలిగించడమంటే.. జీవిత ఎదుగుదలకు అవసరమైన సందేశాన్ని తీసుకోవడమని పెద్దలు చెబుతారు. కావున దీపావళి రోజుతో పాటు కార్తీక పౌర్ణమినాడు దీపాన్ని వెలిగించడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుందని చాలా మంది నమ్ముతారు.

Kalinga Times, Hyderabad : దీపజ్యోతిని పరబ్రహ్మ స్వరూపంగా, మనోవికాసానికి, ఆనందానికి, నవ్వులకు, సజ్జనత్వానికి, సద్గుణ సంపత్తికి నిదర్శనంగా భావిస్తారు. మహిళామణులంతా ఆశ్వీయుజ బహుళ చతుర్దశి నుండి కార్తీక మాసమంతా సంధ్యా సమయంలో మట్టి ప్రమిదలలొ దీపాలను వెలిగిస్తారు. చివరకు ఈ దీపాలను ముత్తయిదువులు కార్తీక పౌర్ణమికి సముద్ర స్నానాలను ఆచరించి జీవనదులలో వదులుతారు. ఇవి సౌభాగ్యానికి, సౌశీల్యానికి, సౌజన్యానికి ప్రతీకలుగా భావిస్తారు. పైగా ఈ దీపావళి శరదృతువులో అరుదెంచటం విశేషం. మనోనిశ్చలతకు, సుఖశాంతులకు అనువైన కాలమిది. దీపాలపండుగ అయిన దీపావళి రోజున మహాలక్ష్మీ పూజను జరుపుకోవడానికి ఓ విశిష్టత ఉంది.
పూర్వం దుర్వాస మహర్షి ఒకమారు దేవేంద్రుని ఆతిథ్యానికి సంతసించి, ఒక మహిమాన్వితమైన హారాన్ని ప్రసాదించాడు. ఇంద్రుడు దానిని తిరస్కార భావముతో తన వద్దనున్న ఐరావతం అను ఏనుగు మెడలో వెేస్తాడు అది ఆ హారాన్ని కాలితో తొక్కివేస్తుంది. అది చూచిన దుర్వాసనుడు ఆగ్రహము చెంది దేవేంద్రుని శపిస్తాడు. తత్ఫలితంగా దేవేంద్రుడు రాజ్యమును కోల్పోయి, సర్వసంపదలు పోగొట్టుకుని దిక్కుతోచక శ్రీహరిని ప్రార్థిస్తాడు. ఈ పరిస్థితిని గమనించిన శ్రీ మహావిష్ణువు దేవేంద్రుని ఒక జ్యోతిని వెలిగించి దానిని శ్రీ మహాలక్ష్మీ స్వరూపంగా తలచి పూజించమని సూచిస్తాడు. దానికి తృప్తిచెందిన లక్ష్మీదేవి అనుగ్రహంతో తిరిగి త్రిలోకాధిపత్యాన్ని, సర్వసంపదలను పొందాడని పురాణాలు చెబుతున్నాయి.
ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు చెంతనే ఉండే మహాలక్ష్మీదేవిని ఇంద్రుడు ఇలా ప్రశ్నించాడు. తల్లి నీవు కేవలం శ్రీహరి వద్దనే ఉండటం న్యాయమా? నీ భక్తులను కరుణించవా? అంటాడు. దీనికి ఆ మాత సమాధానమిస్తూ.. త్రిలోకాథిపతీ..”నన్ను త్రికరణ శుద్ధిగా ఆరాధించే భక్తులకు వారి వారి అభీష్టాలకు అనుగుణంగా మహర్షులకు మోక్షలక్ష్మీ రూపంగా, విజయాన్ని కోరేవారికి విజయలక్ష్మీగా, విద్యార్థులు నన్ను ఆరాధిస్తే విద్యాలక్ష్మీగా, ఐశ్వర్యాన్ని కోరి ఆరాధించేవారికి ధనలక్ష్మీగా, వారి సమస్త కోరికలు నెరవేర్చే వరలక్ష్మీదేవిగా ప్రసన్నురాలౌతానని” సమాధానమిచ్చింది. అందుచేత దీపావళి రోజున మహాలక్ష్మిని పూజించేవారికి సర్వసంపదలు చేకూరుతాయని విశ్వాసం.

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close