Religious
శ్రీ చక్రం – మానవ శరీరం
Kalinga Times,Hyderabad : ఈ జగత్తులోని సకల తత్వాలు,సకల భువనాలు, పరమశివుడు, పరాశక్తి మానవుని యందు కూడా కలవు. మానవ శరీరమును రెండు భాగములుగా చూస్తే ..నాభి నుండి పైభాగము ఊర్థ్వలోకమని, క్రిందిభాగం అధోలోకమని, ఈ రెండింటిని కలిపే వెన్నెముకను మేరుదండమని అంటారు.
శ్రీ చక్రమును కూడామేరువు అంటాము. మేరుపర్వతము కూడా భూమికి ఇరుసు వంటిది. ఏ రకంగా పరాశక్తి దివ్యస్వరూప కాంతులచేత జగత్తంతా ప్రకాశవంతమవుతుందో, మన మేరుదండము లోని కుండలినీ శక్తి చేత శరీరమంతా చైతన్యమవుతుంది. మనలో ఆత్మ ఉన్నదని అంగీకరించినట్లే .. మన శరీరనిర్మాణ ప్రాధాన్యం కూడా గుర్తించాలి.
నవావరణాత్మక మైన శ్రీచక్రానికి, మానవ శరీరానికి తేడా లేదని శాస్త్రం చెబుతోంది. శ్రీచక్రాన్ని ఆరాధిస్తే అన్ని దేవతామూర్తులను ఆరాధించినట్లేనని తంత్రశాస్త్రం తెలుపుతోంది. శ్రీ అంటే శుభకరమైనది. దీనిని నవచక్రమని, వియత్ చక్రమని, నవయోని చక్రమని అంటారు. చక్రము ఎప్పుడూ పరిభ్రమిస్తుంది. దీనికి ఆద్యంతము లుండవు. కేంద్ర బిందువు నుండి పరిధి వరకు ఎక్కడ కొలిచిననూ సమానంగా ఉంటుంది.
చక్రారాధనము ప్రతిమారాధన కన్న శక్తివంతం. మంత్రం వలె యంత్రం కూడా మహిమగలదే. దేహో దేవాలయః ప్రోక్తోజీవో దేవస్సనాతనః త్యేజేదజ్ఞాన నిర్మాల్యంసోహంభావేన పూజయేత్ ! శరీరమే దేవాలయము. జీవుడే అక్కడి దేవుడు, అజ్ఞానమనే మాలిన్యాన్ని త్యజించాలి. ఆ దేవుడే నేననే భావమే పూజ. ఆ భావనతోనే అర్పించాలి. కాబట్టి సాధకుని ధ్యానము, పూజ, భావన బాహ్యము నుండి లోనికి చొచ్చుకొని పోయి ఆత్మను చేరుకోవాలి. విశ్వంలోని శక్తులన్ని ఈనవావరణముల ద్వారాద్యోతకమై మానవుని పంచకోశములందు అంటే.. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశములందు ఇమిడి ఉన్నవి.