Religious
శ్రీమాత, శ్రీ విద్య, శ్రీచక్రములు వేరు వేరుకాదు
Kalinga Times,Hyderabad : శ్రీ చక్రం – పరాశక్తి వేర్వేరు కాదు. అలా ఒకటిగా నున్న పరాబిందువు నుండి మూడు బిందువులేర్పడినవి. 1) శివశక్తులొకటిగా నున్న బిందువు. 2) అచేతనంగాఉన్న శివుడు. 3) ‘చేతనా స్వరూపమైన శక్తి. ఈమూడు బిందువులే త్రిగుణాత్మకము. త్రిపుటల సమ్మేళనము, త్రిపురముల మొదటి త్రికోణము. ఇది శివపార్వతుల ఏకరూపమైన అర్థనారీశ్వర తత్వాన్ని సూచిస్తోంది. మనం పరాశక్తి శుద్ధస్వరూపాన్ని దర్శించలేం, కనీసం ఊహించలేం. కనుక పరాశక్తిమాత తన మొదటిరూపంగా శ్రీచక్రాన్ని నిర్మించింది. తదుపరి అనేక దేవీరూపాలను స్వీకరించి మనకు ఉపాసనా సౌలభ్యాన్ని కల్పించింది. శ్రీచక్రముతో ఈ సకల చరాచర జగత్తునకు నామరూపములకు, పదార్థములకు సమన్వయం కలుగుచున్నది. పరాశక్తికి శ్రీచక్రానికి ఏ మాత్రం భేదం లేదు.శ్రీ దేవియే శ్రీచక్రము. శ్రీమాత, శ్రీ విద్య, శ్రీచక్రములు వేరు వేరుకాదని, ఈ మూడూ ఒకే పరబ్రహ్మ స్వరూపమని శ్రీలలితా సహస్ర నామస్తోత్రము తెలియచేస్తోంది.