Kalinga Times, Hyderabad : యావత్ తెలంగాణ ప్రజలందరి గుండెల నుండి అగ్ని రవ్వలు రేపిన సంధర్భమది.. మతోన్మాద శక్తులకు కొమ్ముగాసిన హైదరాబాద్ ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ కుత్సిత కుతంత్రాలకు తల్లడిల్లిన తెలంగాణ బిడ్డల ఆర్తనాదమది…వేలాది మంది ధీరుల త్యాగాలతో తెలంగాణ క్షేత్రం రక్తసిక్తమైన తరుణమది.. దారుణమైన దురహంకార రజకార్ల పైశాచికత్వమది..విధి వక్రించినా, చరిత్ర తమను గుర్తించకున్నా తెలంగాణ గడ్డమీద హిందూ ప్రజలపై చేసిన దురాక్రమణకు భగవంతుడే స్వయంగా విన్నాడేమో అన్నట్లు ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ రూపంలో రక్షణ కవచం దొరికింది.
అదే ఈ వీర తెలంగాణ దిశను మలుపు తిప్పిన రోజు. అదే మత దురహంకారుల మదం అణచి వారి గుండెల్లో మరణ మృదంగం వాయించిన రోజు… అదే సెప్టెంబర్ 17, 1948.. ఆనాడే.. నయవంచకుడు నిజాం నవాబు ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ చెంత మోకరిల్లిన రోజు.. అదే ఆనాడే.. తెలంగాణ విమోచనదినం!
తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడం ద్వారా యువతరానికి మన ప్రాంత చరిత్రను గుర్తు చేసి ప్రేరణ కల్గించడం తెలంగాణా ప్రభుత్వం బాధ్యత. సెప్టెంబర్ 17న తెలగాణ విమోచన దినోత్సవంగా నిర్వహిస్తూ, నాటి వీరుల త్యాగాలను స్మరిస్తూ, అమరవీరుల స్ఫూర్తి కేంద్రం ఏర్పాటుచేయడం వారిని గౌరవించుకోవడంతోపాటు భవిష్యత్ తరాలు తెలంగాణ ప్రాంత శౌర్యప్రతాపాల గురించి తెలుసుకుని ప్రేరణ పొందేందుకు ఎంతో ఉపయుక్తమవుతుంది