Religious
వినాయక చవితిని ఇళ్ళలోనె జరుపుకొని ప్రభుత్వానికి సహకరించాలి
Kalinga Times , Hyderabad : కరోనా నేపద్యంలో ఈ సంవత్సరం రాష్ట్రంలోని ప్రజలు అందరు గణేష్ ప్రతిమ లను తమ ఇండ్లలోనే ప్రతిష్టించి గణేష్ పండుగ ను సంప్రదాయబద్దంగా జరుపుకొని ప్రభుత్వానికి సహకరించాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ విజ్ఞప్తి చేశారు. సోమవారం మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో హోం శాఖ మంత్రి శ్రీ మహామూద్ అలీ సమక్షంలో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనర్ లు అంజని కుమార్, సజ్జనార్, మహేష్ భగవత్, గ్రేటర్ కమిషనర్ లోకేష్ కుమార్, దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి అద్యక్ష, కార్యదర్శులు రాఘవరెడ్డి, భగవంతరావు, విశ్వహిందు పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు రామరాజు, ఇతర ప్రతినిధులతో మంత్రి శ్రీనివాస్ యాదవ్ సమావేశమైనారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కరోనా మహమ్మారి దృష్ట్యా ప్రజలు, గణేష్ ఉత్సవాల నిర్వాహకులు పరిస్థితులను అవగాహన చేసుకొని ఇండ్లలోనే విగ్రహాలను ప్రతిష్టించి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించుకోవాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తుందన్నారు. సంస్కృతి, సాంప్రదాయాలను ప్రభుత్వం ఎంతో గౌరవిస్తుందని అన్నారు. దేవాదాయ శాఖ పరిధిలోని అన్ని గణేష్ ఆలయాలలో గణేష్ నవరాత్రులు పూర్తయ్యే వరకు సాంప్రదాయ బద్దంగా పూజలు నిర్వహించాలని సమావేశంలో పాల్గొన్న దేవాదాయ శాఖ కమిషనర్ ను మంత్రి ఆదేశించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి చొరవ తో ప్రభుత్వమే అన్ని పండుగలను ఎంతో ఘనంగా నిర్వహించిన విషయాన్ని గుర్తుచేశారు. రంజాన్ కు తోఫా, క్రిస్మస్ కు గిఫ్ట్ ల పంపిణీ, బోనాల ఉత్సావాల నిర్వహణకు ఆలయాలకు నిధులు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికే దక్కుతుందని మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ప్రతి సంవత్సరం నిర్వహించే గణేష్ ఉత్సవాలే కాకుండా అన్ని పండుగలకు ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేసిన విషయం అందరికీ తెలిసిందేనని అన్నారు.