Telangana
భద్రాచలం లో నీటిమట్టం 52 అడుగులకు చేరడంతో రెండో ప్రమాద హెచ్చరిక
Kalinga Times, Hyderabad : భద్రాచలం పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. భద్రాచలం వద్ద ఆదివారం ఉదయం 12గంటలకు గోదావరిలో నీటిమట్టం 52 అడుగులకు చేరడంతో రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. శనివారం ఉదయం మొదటి ప్రమాద హెచ్చరిక అమల్లోకి రాగా.. ప్రస్తుతం రెండో ప్రమాద హెచ్చరిక అమలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం భద్రాచలం వద్ద 13.75 లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహం కొనసాగుతున్నది.ఎగువ ప్రాంతాల్లోని ఇంద్రావతి, కాళేశ్వరం నుంచి వరద పోటెత్తడంతో భద్రాచలం వద్ద గోదావరికి భారీ స్థాయిలో నీరు వస్తుందని సీడబ్ల్యూసీ అధికారులు అంచనా వేస్తున్నారు. 53 అడుగులు దాటితే మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేస్తారు. వరద తాకిడికి లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉండడంతో ఆ ప్రాంత వాసులను అధికారులు అప్రమత్తం చేశారు. బాధితులు పునరావాస కేంద్రాలకు వెళ్లాలని సూచించారు.కాగా భద్రాచలం పడమర మెట్ల వైపు వర్షపు నీరు చేరడంతో ఆదివారం ఉదయం ఈ మార్గంలో దర్శనానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తాయి. పడమర మెట్లతోపాటు అన్నదాన సత్రం వద్ద మురుగునీరు భారీగా వచ్చి చేరింది. బ్యాక్ వాటర్‌ను గోదావరిలోకి మళ్లించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. స్థానికంగా ఉన్న కొత్తకాలనీలోకి వరదనీరు చేరడంతో బాధితులను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు.