
Kalinga Times, Godavarikhani : కేంద్ర ప్రభుత్వం కార్పోరెట్ శక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తూ ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తూ ప్రభుత్వ ఉద్యోగులను దేశద్రోహులుగా చిత్రీకరిస్తున్నారని సిపిఐ నగర కార్యదర్శి కె. కనకరాజ్, సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటియుసి) ఆర్జీ వన్ బ్రాంచ్ కార్యదర్శి మడ్డి ఎల్లాగౌడ్ లు అన్నారు. 74వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని శనివారం స్థానిక భాస్కరరావు భవన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి వారు ముఖ్య అతిథులుగా విచ్చేసి జాతీయ పతాకాలను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ నరేంద్ర మోడి అధికార పగ్గాలు చేపట్టిన నాటినుండి సంపన్న వర్గాలకు కొమ్ముకాస్తున్నాడని తీవ్రంగా విమర్శించారు. ఎల్ ఐ సి, బి ఎస్ ఎన్ ఎల్, ఓ ఎన్ జి సి లాంటి ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తూ అంబానికి దారాదత్తం చేయడానికి కుట్రలు చేస్తున్నాడని ఆరోపించారు. రిలయన్స్ సంస్థలు అభివృద్ధి చెందడానికి దోహదం చేసే విధంగా వ్యవహరించడం సిగ్గుచేటని వారు విమర్శించారు. పెద్ద నోట్ల రద్దుతో భారత ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందని, పేదవారు మరింత పేదవారుగా దిగజారారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దేశ స్వాతంత్ర్యం కోసం తమ విలువైన ప్రాణాలను త్రుణప్రాయంగా అర్పించిన భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్, సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు, ఆజాద్ చంద్రశేఖర్ ల వారసత్వం తో మతోన్మాద ప్రభుత్వానికి తగిన బుద్ది చెప్పాలని, అందుకు పోరాటమే మార్గమని వారు పిలుపు నిచ్చారు. నగర సహాయ కార్యదర్శి తాళ్లపల్లి మల్లయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమం లో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి గోషిక మోహన్, నగర సహాయ కార్యదర్శి మద్దెల దినేష్ ప్రజాసంఘాల నాయకులు ఎర్రల రాజయ్య,బోగె సతీష్, రేణికుంట్ల ప్రీతం, చెప్యాల భాస్కర్, విజయ్, అఖిల్, వినిత్, భూమయ్య తదితరులు పాల్గొన్నారు.