Telangana
ఉద్యోగ అవకాశాలు కల్పించే విధానానికి రాష్ట్ర మంత్రివర్గ ఆమోదం
Kalinga Times, Hyderabad : తెలంగాణ రాష్ట్రంలో నెలకొల్పే పరిశ్రమల్లో స్థానికులకు ఎక్కువ ఉద్యోగ అవకాశాలు కల్పించే నూతన విధానానికి రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అధ్యక్షత జరిగిన ఈ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధానంగా కొత్త సచివాలయం సముదాయం, డిజైన్లు, హైదరాబాద్ చుట్టూ ఐటి విస్తరణ కోసం రూపొందించిన ప్రత్యేక గ్రిడ్ పాలసీకి రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది. అలాగే రాష్ట్రంలో విజృంభిస్తున్న కరోనాను కట్టడి చేసేందుకు మరో రూ.100 కోట్లు మంజూరు చేయాలని మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది. ప్రగతి భవన్‌లో మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభమైన ఈ సమావేశం రాత్రి పదకొండు గంటల వరకు ఏకదాటిగా సుమారు తొమ్మిది గంటల పాటు సాగింది. ఈ సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో పెరిగిపోతున్న నిరుద్యోగులకు పెద్దఎత్తున ఉపాధి అవకశాలు కల్పించేందుకు మంత్రివర్గ సమావేశం కూలంకషంగా చర్చించింది. తదనంతరం ప్రత్యేక విధానానికి మంత్రివర్గ సమావేశం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం టిఎస్ ఐపాస్ చట్టం ద్వారా కొత్త పారిశ్రామిక అనుమతుల విధానం తెచ్చింది. దీని వల్ల పెద్ద ఎత్తున పరిశ్రమలు రాష్ట్రానికి వస్తున్నాయి. అయితే ఇలా వస్తున్న పరిశ్రమల్లో తెలంగాణ యువకులకు ఎక్కువ అవకాశాలు దక్కేలా విధానం రూపొందించాలని ఇటీవలే ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు పరిశ్రమల శాఖను ఆదేశించారు. దీనిపై మంత్రి కెటి రామారావు ఆధ్వర్యంలో కసరత్తు చేసిన పరిశ్రమల శాఖ ముసాయిదా తయారు చేసింది. ప్రధానంగా రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు అధిక ప్రాధాన్యతను ఇవ్వాలని సమావేశంలో నిర్ణయించారు. ఇందులో భాగంగానే రాష్ట్రంలో నెలకొల్పే పరిశ్రమల్లో స్థానికేలకే అధిక అవకాశం లబించేందుకు నూతన విధానాన్ని తీసుకొచ్చింది. ఈ విధానంతో రాష్ట్రంలో నెలకొల్పే పరిశ్రమల్లో స్థానికులకు ఎక్కువ అవకాశాలు లభిస్తాయని కేబినెట్ అభిప్రాయపడింది. స్థానికులకు ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చే పరిశ్రమలకు అదనపు ప్రోత్సాహకాలు అందించాలని రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది.