Telangana
ప్రజలు అత్యవసరమైతేనే హైదరాబాద్ కు రావాలి
Kalinga Times, Hyderabad : రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న కరోనా స్థితిని సామాజిక వ్యాప్తి అని అనలేమని ప్రజారోగ్యశాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు చెప్పారు. ఈ పరిస్థితుల్లో ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ద్వితీయ శ్రేణి నగరాల్లో కేసులు పెరుగుతున్నాయని, కరోనాకు త్వరగా చికిత్స చేస్తే చాలా మంచిదని వెల్లడించారు. వైరస్‌ను కట్టడి చేసేందుకు రాష్ట్రంలోని పీహెచ్‌సీల్లో (ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు) కరోనా టెస్ట్‌లను పెంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. టెస్టుల నిర్వహణకు ప్రభుత్వమే అన్ని సౌకర్యాలు కల్పిస్తుందని పేర్కొన్నారు.
ఇక యాంటీబయాటిక్స్ మందులు, ఇంజెక్షన్లు అన్ని కలిపి రూ.150 ఖర్చు మాత్రమేనని తెలిపారు. సకాలంలో వైద్యం అందితే రూ.లక్షల అవసరం లేదని శ్రీనివాసరావు పేర్కొన్నారు. లక్షల రూపాయలు ప్రయివేటు హాస్పిటల్‌లో ఎందుకు ఛార్జ్ చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వమే అన్ని సదుపాయాలు కల్పిస్తుందని, అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందులు అందుబాటులో ఉంచుతున్నామని తెలిపారు.
ప్రభుత్వాస్పత్రుల్లో ఇప్పటికీ 6,500 పడకలు ఖాళీగా ఉన్నాయని, అన్ని జిల్లా కేంద్రాల్లో కొవిడ్ చికిత్స చేస్తున్నారని వివరించారు. ప్రజలు అత్యవసరమైతేనే హైదరాబాద్ రావాలని తెలిపారు. కరోనా గురించి కోర్టులో రోజుకొకరు పిటిషన్‌లు వేయడం మంచి పరిణామం కాదని అభిప్రాయపడ్డారు. వైద్య సిబ్బందికి అందరూ మద్దతుగా నిలబడాలని కోరారు. ఇప్పటికే సిబ్బంది చాలా ఒత్తిడికి గురవుతున్నారని చెప్పారు.