Andhra Pradesh
ప్రతి జిల్లాలో 5 వేల బెడ్లు
ఆరోగ్య పరిస్థితిని కుటుంబ సభ్యులు తెలుసుకొనేందుకు హెల్ప్ డెస్క్
Kalinga Times, Amaravati : ఆంధ్రప్రదేశ్‌లో పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులను దృష్టిలో పెట్టుకొని 46,198 బెడ్లు సిద్ధం చేసినట్లు కోవిడ్- 19 టాస్క్‌ఫోర్స్ నోడల్ అధికారి ఎంటీ కృష్ణబాబు వెల్లడించారు. ప్రతి జిల్లాలో 5 వేల బెడ్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. కరోనా వైరస్ తీవ్రతరమవుతున్న నేపథ్యంలో అందుకనుగుణంగా కోవిడ్ కేర్ సెంటర్ల సామర్థ్యం పెంచుతున్నట్లు కృష్ణబాబు వెల్లడించారు. అక్కడ ఉన్న పేషెంట్ల ఆరోగ్య పరిస్థితిని కుటుంబ సభ్యులు తెలుసుకొనేందుకు వీలుగా హెల్ప్ డెస్క్ పెట్టాల్సిందిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారని గుర్తు చేశారు. అలాగే కోవిడ్ సెంటర్లలో పెట్టే భోజనం, శానిటేషన్, మందులు, మరుగుదొడ్లు, పరిశుభ్రత వంటి 9 అంశాలపై ఎప్పటికప్పుడు ఫీడ్ బ్యాక్ తీసుకుంటామని తెలిపారు. సిబ్బంది ఏమాత్రం అలసత్వం వహించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.కోవిడ్ వల్ల చనిపోయిన వారి అంత్యక్రియల కోసం రూ. 15,000 ఇవ్వాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారని చెప్పారు. అలాగే చనిపోయిన సమయంలో 20 మంది, పెళ్లిళ్లకు 50కు మించి మంది హాజరయ్యేందుకు అనుమతి లేదని, ఎవరైనా నిబంధనలకు మించి గుమిగుడితే పోలీసులు చర్యలు తీసుకుంటారని కృష్ణబాబు హెచ్చరించారు.