Telangana
మిస్ అవుతున్న పేషెంట్లతో వైరస్ వ్యాప్తి చెందే అవకాశం
Kalinga Times, Hyderabad : నగరంలో మిస్సింగ్ అయిన 2200 మంది కరోనా పేషెంట్లు ఆచూకీ కోసం పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈక్రమంలో కరోనా వైరస్ సోకడంతో వారు వైద్య పరీక్షల అనంతరం కనిపించకుండా పోవడంపై జిహెచ్‌ఎంసి అధికారులు పోలీసులను ఆశ్రయించారు. కాగా మిస్సింగ్ అయిన పేషెంట్లలో దాదాపు 2000 వేల మంది తప్పుడు ఫోన్ నంబర్లు, అడ్రస్ ఇచ్చారని పోలీసుల దర్యాప్తులో తేలింది.
ఇదిలావుండగా కోవిడ్-19 పేషెంట్లకు ప్రభుత్వం హోం ఐసోలేషన్ కిట్లను ఇస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఇంట్లో ఉండి కరోనా చికిత్స పొందుతున్న వారి వివరాలను జిహెచ్‌ఎంసి అధికారులు ఆరా తీయగా దాదాపు 2,200 మంది వివరాలు సరిగా లేవని గుర్తించారు. దీంతో జిహెచ్‌ఎంసి అధికారులు పోలీసులకు విషయం తెలియజేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. అయితే మిస్సింగ్ అయిన కరోనావైరస్ సోకిన వారు తమ ఫోన్లు స్విచ్చాఫ్ చేసుకోవడంతో పాటు ఆధార్ కార్డులో ఉన్న శాశ్వత చిరునామాలో కాకుండా ఇతర ప్రాంతాలలో ఉన్నట్లు పోలీసుల విచారణలో వెలుగుచూసింది.
మిస్ అవుతున్న పేషెంట్లతో వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. ప్రభుత్వం బాధ్యతగా కరోనా కట్టడి కోసం శ్రమిస్తుంటే, ఇలా తప్పుడు అడ్రస్‌లు ఇవ్వడం ఎంత వరకు సబబని పలువురు ప్రశ్నిస్తున్నారు. అయితే ప్రస్తుతం వారు ఎక్కడున్నారో తెలుసుకునేందుకు అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే కొంత మంది కుటుంబ సభ్యుల వివరాలు కూడా ఇంకా లభించలేదని, వారిని కూడా రెండు రోజుల్లో గుర్తిస్తామని అధికారులు తెలిపారు. కరోనా సోకితే ఎలాంటి భయందోళనకు గురికావొద్దని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. సమాజంలో వెలివేత, చిన్నచూపు చూడటం వలనే ఇలాంటి పరిస్థితి వస్తుందని ఓ ముఖ్య అధికారి చెప్పారు.