
Kalinga Times, New Amaravati : భవిష్యత్‌లో కరోనా సోకని వ్యక్తి అంటూ ఎవరూ ఉండరేమోనని ఏపీ సీఎం జగన్ అభిప్రాయపడ్డారు. జ్వరం వచ్చినట్లే అందరికీ కరోనా కూడా సంక్రమిస్తుందని వ్యాఖ్యానించారు. ఆరు జిల్లాలకు ఆరోగ్యశ్రీ కొత్త సేవల విస్తరణ సందర్భంగా ఆయా జిల్లాల కలెక్టర్లతో జగన్ గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్లకు పలు సూచనలు చేస్తూ సీఎం జగన్ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. కరోనాకు వ్యాక్సిన్ వచ్చే వరకు దానితో సహజీవనం చేయాల్సిందేనని మరోసారి అన్నారు. కరోనా ఉందని తెలిసిన వెంటనే ఎవరికి ఫోన్ చేయాలి? వైద్యం ఎలా పొందాలి అనే దానిపై అవగాహన కల్పించాలని సూచించారు. ఏపీకి ఆనుకొని ఉన్న తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల సరిహద్దులు తెరిచినందున రాకపోకలు పెరుగుతాయని, దీంతో కరోనా కేసులు కూడా పెరుగుతాయని తెలిపారు. ఇకపై కరోనా సంక్రమించడాన్ని ఎవరూ ఆపలేరని చెప్పారు. ప్రస్తుతం కరోనా బారిన పడ్డవారిలో చాలా మంది ఇంటి వద్ద ఉండి వ్యాధిని నయం చేసుకోవచ్చని జగన్ అన్నారు. తక్కువ సంఖ్యలో మాత్రమే ఆస్పత్రుల్లో చేరి చికిత్స పొందుతున్నారని, మొత్తం రోగుల్లో కేవలం 4 శాతం మాత్రమే ఐసీయూల్లో ఉంటున్నారని సీఎం గుర్తు చేశారు. వ్యాక్సిన్ వచ్చే వరకూ కరోనా సంక్రమణను ఎవరూ ఆపలేరని అన్నారు.