Andhra Pradesh
మత్స్యకారుడికి బ్యాంకు ఖాతాలో 10 వేలు జమ
Kalinga Times, Amaravati : లాక్ డౌన్, చేపల వేటపై నిషేధం కారణంగా ఈ ఏడాది మూడు నెలలపాటు ఉపాధి కోల్పోయిన మత్స్యకారులను ఆదుకునేందుకు ఏపీ ప్రభుత్వం సంకల్పించింది. మత్స్యకారులకు విరామ భృతి అందించే కార్యక్రమాన్ని ఈ నెల 6వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రారంభించనున్నారు. ఒక్కో మత్స్యకారుడికి బ్యాంకు ఖాతాలో ప్రభుత్వం రూ.10 వేలు జమ చేయనుంది. ఈ భృతికి అర్హుల పేర్లు, వివరాలను గ్రామ సచివాలయాల్లో ప్రజలకు అందుబాటులో ఉంచింది. దీని వల్ల మొత్తం 1.09 లక్షల మంది మత్స్యకారులకు లబ్ధి చేకూరనుంది. కేంద్ర ప్రభుత్వం మార్చి 24న లాక్ డౌన్ ప్రకటించడంతో అప్పటి నుంచి సముద్రంలో చేపల వేటను మత్స్యకారులు నిలిపివేశారు. ఏప్రిల్ 15 నుంచి జూన్ 14వ తేదీ వరకు రాష్ట్ర ప్రభుత్వం సముద్రంలో వేటను నిషేధించింది. ఈ రెండు కారణాలతో సముద్రంలో చేపల వేటకు అవకాశం లేకపోయింది. దీంతో పనులు లేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్న వీరికి విరామ సాయం అందించాలని ప్రభుత్వం భావించింది. ఈ మేరకు లబ్ధిదారుల ఎంపికకు మార్గదర్శకాలను విడుదల చేసింది.