Telangana
రైతుల కంట ఆనంద బాష్పాలు
Kalinga Times, Siddipet : సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలంలోని రంగనాయక సాగర్ ప్రాజెక్టు ప్రధాన కాలువల ద్వారా మంత్రి హరీశ్ రావు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీంతో ఆ ప్రాంత వాసుల సాగు నీటి కష్టాలు తీరనున్నాయి. ప్రాజెక్టు కాల్వల ద్వారా నీటిని విడుదల చేయడం సంతోషాన్ని కలిగిస్తుందని ఈ క్షణాల కోసం రైతులు తరతరాలుగా ఎదురు చూశారని కాలువల వెంట గోదావరి నీరు పోతుంటే అది చూసిన రైతుల కంట ఆనంద బాష్పాలు కారుతున్నాయని హరీశ్ రావు అన్నారు. రైతులు ఇంతకాలం కరెంటు, వానాకాలంపైనే ఆధారపడి పంటలు పండించారని గుర్తు చేశారు. ఇకపై వాటితో పని ఉండదని.. ఏడాది మొత్తం రంగనాయక సాగర్‌కి నీళ్లు అందుబాటులో ఉంటాయని చెప్పారు. దీంతో కరవును శాశ్వతంగా పారదోలవచ్చని అన్నారు. కుడి కాలువ కింద 40 వేల ఎకరాలు, ఎడమ కాలువ ద్వారా 70 వేల ఎకరాలు సాగవుతుందని మంత్రి అన్నారు. ప్రాజెక్టు కింద ఉన్న చెరువులు, చెక్‌డ్యాంలు, కుంటలన్నింటిని నింపుతామని చెప్పారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ రోజా, అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, భూపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు ఇంజినీర్ ఇన్ చీఫ్ హరిరామ్.. మల్లన్న సాగర్ ప్రాజెక్టు సొరంగం నాలుగు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు.