Telangana
రంగనాయక సాగర్ జలాశయంలోకి గోదావరి జలాలు
Kalinga Times, Siddipet : ఆనాడు తెలంగాణ ప్రకటన వచ్చిన రోజు ఎంత సంతోషంగా ఉందో… ఇప్పుడు కూడా అంతే సంతోషంగా ఉందని మంత్రి హరీష్ రావు తెలిపారు. రంగనాయక సాగర్ జలాశయంలోకి గోదావరి జలాలను మంత్రులు హరీష్ రావు, కెటిఆర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. తెలంగాణ అభివృద్ధిలో వలస కూలీలు భాగమని కొనియాడారు. ప్రాజెక్ట్ నిర్మాణంలో పాలు పంచుకున్న కూలీలు, ఇంజనీర్లు, రెవెన్యూ ఉద్యోగులు, ప్రభుత్వాధికారులకు పాదాభివందనం చేస్తున్నానని ప్రశంసించారు. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో రెండు మూడు సంవత్సరాల నుంచి పని చేస్తున్నా కూలీలను సన్మానం చేస్తామన్నారు. అసాధ్యమైన పనిని ఇవాళ సిఎం కెసిఆర్ సుసాధ్యం చేశారని హరీష్ రావు పొగిడారు. సిద్దిపేటకు గోదావరి జలాలు రావడం దశాబ్దాల కల అని, సిఎం కెసిఆర్ అవిశ్రాంతంగా శ్రమించి సిద్దిపేట వాసుల చిరకాల స్వప్నాన్ని నెరవేర్చారని ప్రశంసించారు.
ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ.. ….
సిఎం కెసిఆర్‌కు సిద్దిపేట అంటే అమితమైన ప్రేమ ఉందని మంత్రి కెటిఆర్ తెలిపారు. సిద్ధిపేట ప్రజలు ధన్యజీవులన్నారు. రంగనాయక సాగర్ ప్రాజెక్ట్ ద్వారా సిద్దిపేట నియోజకవర్గానికి 71 వేల ఎకరాలు, సిరిసిల్ల నియోజకవర్గానికి 23,645 ఎకరాలు, హుస్నాబాద్‌కు 4900 ఎకరాలు,
మానుకోండూరుకు 9700 ఎకరాలు, జనగామ నియోజకవర్గానికి 1000 ఎకరాలకు సాగు నీరు అందుతుందన్నారు. ఈ ఆరు నియోజక వర్గాలకు నీరు అందిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు ఇక్కడి రైతులకు కాలువలు అంటే తెలియదు…. వర్షం పడితే బోర్ల ద్వారా మాత్రమే పంటలు పండించేవారని, కాలంతో పని లేకుండా రబీ, ఖరీఫ్ పంటలు పండించుకోవచ్చని కెటిఆర్ పేర్కొన్నారు. చిరస్మరణీయ ఘట్టం తమ చేతుల మీదుగా ప్రారంభ కావడం అదృష్టమని, కాళేశ్వరం నిర్మాణంలో సిఎం కెసిఆర్ ఆలోచనలకు అనుగుణంగా హరీష్ రావు శ్రమించారని, కాళేశ్వరం నిర్మాణంలో శ్రమించిన హరీష్ రావుకు కెటిఆర్ అభినందనలు తెలిపారు. రాబోయే రోజుల్లో నాలుగు రకాల విప్లవాలు చూడబోతున్నామని,
తెలంగాణలో హరిత విప్లవం వస్తుందని, మత్స సంపద పెరిగి నీలి విప్లవం రాబోతుందని, పాడి రైతులు క్షీర విప్లవం తీసుకొస్తారని, గొర్రెల పెంపకం ద్వారా గులాబీ విప్లవం వస్తుందని ఆశభావం వ్యక్తం చేశారు. తెలంగాణ కోటి ఎకరాల మాగాణి కెసిఆర్ నాయకత్వంలో అవుతుందని కెటిఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు.