National

పాక్ ఆక్రమిత కశ్మీర్, ఆక్సాయ్ చిన్ సైతం భారత్‌కు చెందిన భూభాగాలే

Kalinga Times,New Delhi :జమ్మూ కశ్మీర్ భారత్‌లో అంతర్భాగమని, ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి సందేహాలు అక్కర్లేదని అమిత్ షా స్పష్టం చేశారు. జమ్మూ-కశ్మీర్ విషయంలో ఎలాంటి చట్టాలు చేయాలన్నా పార్లమెంటకు సర్వాధికారాలున్నాయని పేర్కొనారు. చట్టం చేయకుండా అడ్డుకునే అధికారం ఎవరికీ లేదని చెప్పారు. పాక్ ఆక్రమిత కశ్మీర్, ఆక్సాయ్ చిన్ సైతం భారత్‌కు చెందిన భూభాగాలేనని, రాజ్యాంగంలో ఈ విషయాన్ని స్పష్టంగా ప్రస్తావించారని షా తెలిపారు. కశ్మీర్ అంశంతో ఇతర దేశాలకు సంబంధం లేదని అమిత్ షా ఉద్ఘాటించారు. పీఓకేను స్వాధీనం చేసుకోడానికి తన ప్రాణాలైనా అర్పించడానికి సిద్ధంగా ఉన్నానని ఆయన పేర్కొన్నారు. అలాగే కశ్మీర్ అంశం తమ అంతర్గత వ్యవహారమని పాకిస్థాన్‌తో జరిగిన పలు ద్వైపాక్షిక సమావేశాల్లో స్పష్టం చేశామని షా అన్నారు.

కశ్మీర్ వివాదాన్ని పరిష్కరానికి ఐక్యరాజ్యసమితి జోక్యం చేసుకోవాలని కాంగ్రెస్ కోరుకుంటుందా? అని అమిత్ షా ప్రశ్నించారు. జమ్మూ కశ్మీర్ భారత్‌లో అంతర్భాగం కాదని చెప్పదలచుకున్నారా? అని కాంగ్రెస్‌ను కేంద్ర మంత్రి నిలదీశారు. జమ్మూ కశ్మీర్‌ను భారత్‌లో సంపూర్ణంగా విలీనం చేస్తున్నామని, ఈ పునర్విభజన బిల్లు దేశ చరిత్రలో ఓ సువర్ణాధ్యాయమని కేంద్ర హోం మంత్రి వ్యాఖ్యానించారు. ఆర్టికల్ 370 రద్దుకు పార్లమెంటు ఆమోదం అవసరంలేదని, రాష్ట్రపతి గెజిట్ సరిపోతుందని షా స్పష్టీకరించారు. ఆర్టికల్ 370ను సోమవారమే రాష్ట్రపతి తన గెజిట్ ద్వారా రద్దుచేశారని ఆయన తెలిపారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేసింది. కశ్మీర్ అంతర్గత అంశమా? ద్వైపాక్షిక విషయమా? చెప్పాలని కాంగ్రెస్ నిలదీసింది. అన్ని నియమాలను ఉల్లంఘించి కశ్మీర్ విభజన బిల్లును తీసుకొచ్చారని ఆరోపించింది. భారీగా భద్రతా బలగాలను మోహరించి కశ్మీర్‌ను జైలుగా మార్చి, మాజీ ముఖ్యమంత్రులను గృహనిర్భంధలోకి తీసుకున్నారని దుయ్యబట్టింది. మొదటి నుంచి కశ్మీర్ అంతర్గత వ్యవహారంగానే ఉందని, ఇటీవల విదేశాంగ మంత్రి ఇది ద్వైపాక్షిక అంశమని చెప్పారని కాంగ్రెస్ మండిపడ్డింది. నిన్నటి వరకు ద్వైపాక్షిక అంశంగా ఉన్న కశ్మీర్, నేడు అంతర్గత వ్యవహారం ఎలా అవుతుందని కాంగ్రెస్ ప్రశ్నించింది. దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ అమలవుతోందని, కేంద్రం నిబంధనలను విస్మరించిందని ఆరోపించింది.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close