Telangana
రుణాలే మిగిలాయి!

సంగారెడ్డి, డిసెంబర్ 28, 2018 (న్యూస్ లోకల్ )
పత్తి పంటకు మంచి మద్దతు ధర ప్రకటించింది కేంద్రప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతులకు అండగా ఉంటామని స్పష్టం చేయడంతో తెలంగాణ రైతులు ఎక్కువగా పత్తినే పండించారు. అయితే పంట చేతికొచ్చే సమయానికి మాత్రం పరిస్థితి తారుమారైందని సంగారెడ్డి జిల్లాకు చెందిన పలువురు రైతులు వాపోతున్నారు. ప్రతికూల పరిస్థితులు తట్టుకుంటూ పండించిన పంటకు సరైన ధర దక్కడంలేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. అకాల వర్షాల వల్లా సమస్యలు ఉత్పన్నమయ్యాయని ఈ ఏడాది కూడా ఆర్ధిక సమస్యలు తప్పేలా లేవని అంటున్నారు.
జిల్లాలో సాధారణ విస్తీర్ణానికి మించి పత్తిని సాగు చేశారు. వర్షాలు సరిగాలేక ఇబ్బందులు ఏర్పడ్డాయి. పొలాల్లో రెండుసార్లు విత్తిన రైతులు చాలామందే ఉన్నారు. ఇంత చేసినా వానలు సరిగా లేకపోవడంతో పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. మొక్కలు ఎదగకపోవడంతో నామమాత్రంగానే దిగుబడి వచ్చింది. మరోవైపు అకాల వర్షాలు, తెగుళ్లు తట్టుకుంటూ కొద్దోగొప్పో పండించారు.
వాస్తవానికి సగటున ఎకరాకు పది క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుందనేది అధికారుల అంచనా. కానీ ఈ అంచనా వాస్తవరూపం దాల్చలేదు. వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల అధికారులు మొత్తంగా దాదాపు ఇరవై లక్షల క్వింటాళ్ల దిగుబడి జిల్లాలో వస్తుందని భావించారు. ప్రస్తుతం చాలా మంది రైతులకు ఎకరాకు మూడు క్వింటాళ్లకు మించడం లేదు.
డిసెంబరు ప్రారంభంలో ఒకసారి పత్తి తీసిన వారిలో కొందరికి ఎకరాకు రెండు క్వింటాళ్ల దిగుబడి కూడా వచ్చింది. పంట ఎదగకపోవడంతో మరోసారి పత్తి తీసే అవకాశం కనిపించడం లేదని పలువురు రైతులు అంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో మొక్కలన్నీ ఎండిపోయాయి. చాలా మంది రైతుల ఎండిపోయిన మొక్కలను తొలగించే పనిలో ఉన్నారు. ఇక కౌలు రైతుల కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. ప్రతికూల వాతావరణం వల్ల పంట దిగుబడి క్షీణించడం వారిని సమస్యల కొలిమిలోకి నెట్టినట్లైంది. సొంత భూములు లేవు. తాము పండించిన పంటకే సరైన మద్దతు ధర లేదు. పైగా భూ యజమానులకు కౌలు చెల్లించాలి.
ఇదిలాఉంటే సీసీఐ అందిస్తున్న మద్దతు ధరను పరిగణలోకి తీసుకున్నా చాలా మందికి ఎకరాకు రూ.16 వేల వరకు అందుతాయి. ఈ నగదు తాము చెల్లించిన కౌలు కంటే తక్కువని చాలా మంది రైతులు అంటున్నారు. మొత్తంగా కౌలు రైతుల్లో ఆందోళన వెల్లువెత్తుతోంది. పలువురు రైతులకు పెట్టుబడి ఖర్చులు కూడా దక్కే పరిస్థితి లేదు. దీంతో ఈ దఫా కూడా ఆర్ధిక సమస్యలతోనే సావాసం చేయాల్సిన అగత్యం ఏర్పడిందని రైతులు వాపోతున్నారు. ఎరువులు, పురుగు మందులు, కూలీలు… ఇలా మిగతా ఖర్చులన్నింటికి కోసం చేసిన అప్పులు అలాగే ఉండిపోయాయని కన్నీటిపర్యంతమవుతున్నారు. ప్రభుత్వమే స్పందించి తమను ఆదుకోవాలని విజ్ఞప్తిచేస్తున్నారు.