Telangana

విధుల్లో చేరకపోతే .. ప్రైవేటు పర్మిట్లు

తీర్పు మరోలా ఉంటే.. ఆర్టీసీగానీ, తాముగానీ సుప్రీంకోర్టుకు

Kalinga Times ,Hyderabad ; గడువులోగా విధుల్లో చేరని ఆర్టీసీ కార్మికులను ఆ తరువాత ఎట్టిపరిస్థితుల్లోనూ చేర్చుకోకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. కార్మికులు గడువు (మంగళవారం అర్ధరాత్రి)లోగా విధుల్లో చేరకపోతే మిగిలిన 5వేల బస్సులకు కూడా ప్రైవేటు పర్మిట్లు ఇస్తామని, మొత్తం ఆర్టీసీని ప్రైవేటీకరిస్తామని పేర్కొంది. ప్రస్తుతం కేసును విచారిస్తున్న హైకోర్టు కూడా ప్రభుత్వాన్ని ఆదేశించజాలదని తెలిపింది. ఒకవేళ తీర్పు మరోలా ఉంటే.. ఆర్టీసీగానీ, తాముగానీ సుప్రీంకోర్టుకు వెళతామని హెచ్చరించింది. అదే జరిగితే సాగేది అంతంలేని పోరాటమేనని, అప్పుడు కార్మికులకు ఒరిగేదేమీ ఉండదని పేర్కొంది. విధుల్లో చేరడానికి గడువు ఇవ్వడం ద్వారా మంచి అవకాశం ఇచ్చినట్లయిందని, దానిని ఉపయోగించుకుని ఉద్యోగాలు కాపాడుకోవడమా? వినియోగించుకోకుండా ఉద్యోగాలు కోల్పోయి, కుటుంబాలను ఇబ్బందులపాలు చేయడమా? అనేది కార్మికులే తేల్చుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. మిగిలిన రూట్లలోనూ ప్రైవేటు వాహనాలకు పర్మిట్లు ఇచ్చాక.. తెలంగాణలో ఇక ఆర్టీసీ ఉండదని స్పష్టం చేసింది. ఆర్టీసీ సమ్మె, హైకోర్టులో విచారణ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సోమవారం రాత్రి ప్రగతి భవన్‌లో రవాణా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.కె.జోషి, ఇతర ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. సమ్మె విషయంలో, కోర్టు విచారణ సందర్భంగా అనుసరించాల్సిన వైఖరిపై చర్చించారు. న్యాయ నిపుణుల సలహాలు తీసుకున్నారు. కార్మిక చట్టాలను, కేంద్ర రవాణా చట్టాన్ని పరిశీలించారు.
యూనియన్‌ నాయకుల  మభ్యలో..
హైకోర్టులో జరుగుతున్న విచారణను చూపి.. యూనియన్‌ నాయకులు కార్మికులను మభ్య పెడుతున్నారు. కానీ, న్యాయ నిపుణుల అభిప్రాయం ప్రకారం సమ్మె విషయంలో ప్రభుత్వానికి కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇచ్చే అవకాశం లేదు. కోర్టు తేల్చగలిగింది కూడా ఏమీ లేదు. హైకోర్టు తీర్పు మరోలా ఉంటే, ఇంతదూరం వచ్చిన తర్వాత ఆర్టీసీగానీ, ప్రభుత్వం గానీ సుప్రీం కోర్టుకు వెళుతుంది. ఒకవేళ కేసు సుప్రీంకోర్టుకు వెళితే, అక్కడ విచారణ మరింత ఆలస్యమవుతుంది. గతానుభవాలను బట్టి చూస్తే సుప్రీంకోర్టులో ఒక్కోసారి ఏళ్ల తరబడి కేసుల విచారణ సాగుతుంది. అది అంతం లేని పోరాటమవుతుంది. కాబట్టి కార్మికులకు ఒరిగేదేమీ ఉండదు అని అభిప్రాయం వ్యక్తమైంది.

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close