social

వెలిగించు దీపాన్ని..తొలగించుకో పాపాన్ని

Kalinga Times,Hydearabad : కార్తీక మాసంలో మహాశివుడి అనుగ్రహం పొందాలంటే తెల్లవారుజామునే తలస్నానం చేసి శివుని ఆలయానికి వెళ్లి భక్తిశ్రద్ధలతో పూజించాలి. అప్పుడే ఆ మహాశివుని కరుణా కటాక్షాలు లభిస్తాయి. కార్తీక మాసంలో దేశవ్యాప్తంగా రుద్రాభిషేకాలు, రుద్రపూజ, లక్ష బిల్వదళాలతో పూజలు, అమ్మవారికి కుంకుమార్చనలు, అభిషేకాలు శివాలయాలలో విశేషంగా నిర్వహిస్తారు. మహాశివునికి అత్యంత ప్రీతిపాత్రమైన కార్తీక మాసంలో శివారాధన చేయడం వల్ల పరమేశ్వరుడు కోరిన కోరికలు నెరవేరుస్తాడు.
కార్తీకానికి సమానంగా ఏ మాసం లేదు..!
నెలరోజుల పాటు కార్తీక పురాణాన్ని రోజుకొక అధ్యాయం వంతున చదవటం, వినటం వల్ల ఎంతో మేలు జరుగుతుందని చెబుతారు. పురాణాలలో తొలిసారిగా వశిష్ట మహర్షి జనక మహారాజులకు కార్తీక మాస వైభవాన్ని వివరించారు. జన్మ జన్మల పాపాలను హరించి అనంతమైన పుణ్యఫలాలను ప్రసాదించే మహిమాన్వితమైన కార్తీక మాసంలో నదీ స్నానం, ఉపవాసం, దీపారాధన దీప దానం, సాలగ్రామ పూజ, పూజ, వన భోజన కార్యక్రమాలను ఎక్కువగా జరుపుతారు.
కార్తీక దీపానికి చాలా విశిష్టత..
కార్తీక మాసంలో దీపం చాలా ప్రత్యేకమైనది. పరమేశ్వరుని అనుగ్రహం పొందడానికి ఈ నెలలోని అన్ని రోజులలో మన ఇంటి ముంగిట సాయంకాల సమయం దీపాలు వెలిగిస్తే చాలా మంచిది. శివాలయం ప్రాంగణంలో కూడా దీపాలు వెలిగిస్తే వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అని పురాణాలలో పేర్కొనబడింది.
ఉసిరికాయ వత్తులతో..
కార్తీక మాసంలో కార్తీక సోమవారాలు అత్యంత పవిత్రమైనవి. సోమవారం, కార్తీకమాసం రెండూ శివునికి ప్రీతికరమైనవే. కాబట్టి కార్తీక సోమవారాలలో సాయంకాలం సమయంలో శివాలయంలో ఉసిరికాయపై వత్తులు పెట్టి దీపం వెలిగించడం ఎంతో శ్రేయస్కరం. నువ్వుల నూనె, ఆవు నెయ్యి, కొబ్బరి నూనె, నెయ్యి, అవిశనూనె, ఆముదం వంటి వాటితో దీపాలను వెలిగించాలి.
పౌర్ణమి రోజున దీప దానం..
కార్తీక పౌర్ణమి చాలా పవిత్రమైనది. ఎందుకంటే కార్తీక మాసంలోని 30 రోజులలో దీపం వెలిగించని వారు కార్తీక పౌర్ణమి రోజున తప్పకుండా దీపం వెలిగించాలి.అలా ఆ రోజు దీపం పెడితే చాలా మంచిది. అంతేకాదు ఈ కార్తీక మాసంలో దీపం దానం చేయడం వల్ల మరింత మంచి జరుగుతుంది.
ఉసిరి చెట్టు కింద వన భోజనం..
కార్తీక మాసంలో వన భోజనాన్ని కార్తీక సోమవారం లేదా కార్తీక మాసంలోని ఏదో ఒక రోజు ఉసిరి చెట్టు కింద భోజనం చేయడం మంచిది. ఉసిరి చెట్టు కింద సాలగ్రామాన్ని ఉంచి గంధం, అక్షింతలు, పుష్పాలతో పూజించాలి. అనంతరం పూజారులను సత్కరించి అందరూ కలిసిమెలసి భోజనం చేయాలి. ఈ నియమాలను పాటించడం వల్ల కూడా శివానుగ్రహం కలిగి సర్వపాపాలు నశిస్తాయని నమ్మకం. వన భోజన కార్యక్రమాలను నిర్వహించే వారికి పాపాల నుండి విముక్తి కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి.
తులసి పూజ..
కార్తీక పౌర్ణమి రోజున తులసి పూజ కూడా చేయాలి. ఆవు నెయ్యితో తడిపిన దారపు వత్తులతో దీపాలు వెలిగించాలి. తులసికోట చుట్టూ పదకొండు ప్రదక్షిణలు చేసి పరమాన్నం నైవేద్యంగా పెట్టాలి. ఆ తర్వాత 365 వత్తులతో కూడిన హారతి ఇవ్వాలి. నక్షత్రాలు మాయం కాకముందే ఈ పూజ చేస్తే మంచి ఫలితం ఉంటుందని పురాణాలలో పేర్కొనబడింది
విష్ణు ఆలయంలోనూ దీపారాధన..
కార్తీక మాసంలో ప్రతిరోజూ ప్రదోష కాలంలో శివాలయానికి వెళ్లాలి. శివుని దర్శనం చేసుకోవాలి. అలాగే విష్ణు ఆలయంలో దీపాన్ని వెలిగించడం చాలా మంచిది. ఇంట్లో కూడా ప్రతిరోజూ సంధ్యాదీపాన్ని వెలిగించాలి. ఈ మాసమంతా కార్తీక పురాణాన్ని రోజుకో అధ్యాయం పారాయణం చేయడం శుభప్రదం.

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close