Telangana
ప్రభుత్వంలో విలీనం చేయడం తప్ప మిగిలిన అంశాల పరిశీలన
Kalinga Times,Hyderabad : టీఎ్‌సఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం తప్ప మిగిలిన అంశాలను పరిశీలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. హైకోర్టు ఆదేశాలతో ఆర్టీసీ సమ్మెపై కాస్త సానుకూలంగా స్పందించింది. కోర్టు సూచించినట్లు 21 డిమాండ్లను పరిశీలించడానికి ముందుకొచ్చింది. ఇందుకు ఆర్టీసీకి చెందిన ఆరుగురు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లతో కమిటీ వేసింది. 21 డిమాండ్లను పరిష్కరించడానికి పెద్దగా ఆర్థికపరమైన ఇబ్బందులు లేవంటూ హైకోర్టు సూచించిన నేపథ్యంలో కమిటీ వీటిని పరిశీలించనుంది. ఈ మేరకు ప్రభుత్వం కమిటీకి నిర్దేశించింది. కానీ, కార్మికులతో చర్చలు జరిపే అంశాన్ని మాత్రం ప్రస్తావించలేదు. కమిటీ ఇచ్చిన రిపోర్టు ఆధారంగా హైకోర్టుకు నివేదిక సమర్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈనెల 5 నుంచి ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె మంగళవారానికి 18వ రోజుకు చేరింది. కానీ.. ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి చర్చల ప్రస్తావన రాలేదు. చర్చలు జరపాలంటూ హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో సీఎం కేసీఆర్ తొలిసారిగా స్పందించారు. మంగళవారం సమీక్ష నిర్వహించారు.