
Kalinga Times,Hyderabad :తెలంగాణ రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న తాజా రాజకీయ, శాంతిభద్రతల పరిస్థితులపై కేంద్రం ఆరా తీస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ను హుటాహుటిన ఢిల్లికి పిలిపించింది. మంగళవారం మధ్యాహ్నం ఢిల్లి చేరుకున్న గవర్నర్, సాయంత్రం గం. 6.00 సమయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో సమావేశమై, సుమారు 40 నిమిషాల పాటు వివిధ అంశాలపై చర్చించారు. గవర్నర్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలిసారిగా భేటీ కావడం మర్యాదపూర్వకమే అయినప్పటికీ, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. ఆర్టీసీ కార్మికుల సమ్మె, ప్రతిపక్షాల మద్దతుతో తలపెట్టిన రాష్ట్ర బంద్ తదితర అంశాలపై గవర్నర్ ప్రధానికి వివరించినట్టుగా తెలుస్తోంది. అలాగే గవర్నర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాజ్భవన్లో చేపట్టిన వివిధ కార్యక్రమాల గురించి ప్రధానికి వివరించినట్టుగా గవర్నర్ కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. తెలంగాణ సంస్కృతిలో భాగమైన బతుకమ్మ ఉత్సవాలను రాజ్భవన్లో నిర్వ#హంచడంతో పాటు ప్లాస్టిక్ నిషేధం, యోగా తరగతుల ఏర్పాటు, రెడ్ క్రాస్ సంస్థతో కలిసి రక్తదానం వంటి కార్యక్రమాలను ప్రధాన మంత్రి మెచ్చుకున్నారని ప్రకటనలో పేర్కొన్నారు. బతుకమ్మ ఉత్సవాలకు సంబంధించి ఒక పుస్తకాన్ని ప్రధానికి అందజేసినట్టు వెల్లడించారు. ప్రధానితో సమావేశం ముగిసిన అనంతరం రాత్రి గం. 8.00 సమయంలో హోంమంత్రి అమిత్ షాతో గవర్నర్ తమిళిసై భేటీ అయ్యారు. ఈ భేటీలో ప్రధానంగా రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ, శాంతిభద్రతల పరిస్థితుల గురించే చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ నేతలు గవర్నర్ను కలిసి అందజేసిన వినతి పత్రాలను, కార్మికులకు ప్రభుత్వానికి మధ్య నెలకొన్న విబేధాలు, ఘర్షణ పూరిత పరిస్థితులను అమిత్ షాకు గవర్నర్ వివరించడంతో పాటు ఓ నివేదికను సైతం అందజేసినట్టు సమాచారం.