
నల్లగొండ, డిసెంబర్ 22, (లొకల్ న్యూస్)
పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. పల్లెసీమల్లో పోటీలేకుండా ఏకగ్రీవంగా నిలుపుకొనేందుకు ఊళ్లన్నీ ఏకమవుతున్నాయి. ఏకగ్రీవ పంచాయతీలకు ప్రభుత్వం కూడా ప్రోత్సాహకాలు అందిస్తుండటం, ప్రత్యేకంగా గుర్తిస్తుండటంతో రాజకీయాలకు అతీతంగా ప్రజాప్రతినిధులను ఎన్నుకోవడానికి గ్రామాల్లో యువత పూనుకొంటున్నది. రిజర్వేషన్ల ప్రక్రియను పంచాయతీరాజ్ శాఖ వేగవంతం చేసింది. అన్నిజిల్లాల నుంచి బీసీ జనాభా వివరాలు ఆ శాఖకు చేరాయి. దీంతో శుక్రవారం కల్లా సర్పంచుల స్థాయిలో రిజర్వేషన్లు పూర్తిచేసి జిల్లాలకు పంపాలని నిర్ణయించింది.రాష్ట్ర ప్రభుత్వం నూతన పంచాయతీరాజ్ చట్టాన్ని రూపొందించి అమలుచేస్తుండటం, బడ్జెట్ నుంచి నేరుగా నిధులు కేటాయిస్తుండటంతో తమ గ్రామాలను అభివృద్ధి చేసుకోవడానికి యువతరం కదులుతున్నది. రాష్ట్రంలో గ్రామాలు నవశకంవైపు అడుగులు వేస్తున్నాయి. ఇన్నేండ్లూ తీవ్రమైన వెనుకబాటుకు గురైన తండాలు, శివారు గ్రామాలు, ఊరికి దూరంగా ఉన్న పల్లెలు ఇప్పుడు అభివృద్ధిలో పోటీపడటానికి సిద్ధమవుతున్నాయి. పంచాయతీ ఎన్నికలను మూడు విడుతల్లో నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తిచేసింది. జనవరి పదిలోగా ఎన్నికలను నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలిచ్చిన నేపథ్యంలో.. ఆ మేరకు ఎన్నికల నిర్వహణకు సన్నద్ధమవుతున్నది. నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత 15 రోజులకు మొదటి విడుత ఎన్నికలు జరుగుతాయని తర్వాత నాలుగు రోజుల వ్యవధితో మిగతా రెండు విడుతల్లో ఎన్నికలు జరుగుతాయని అధికారులు చెప్తున్నారు. మొత్తం 23 రోజుల్లో పంచాయతీ ఎన్నికల ప్రక్రియను పూర్తిచేస్తామన్నారు. అయితే, హైకోర్టు ఇచ్చిన గడువు చాలా స్వల్పంగా ఉన్నందున ఎన్నికల నిర్వహణకు కోర్టును కొంతసమయం అడిగినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు చెప్తున్నారు. రిజర్వేషన్ల ఖరారు తర్వాత కూడా ఎన్నికల నిర్వహణకు కొంత సమయం కావాల్సి ఉంటుందని స్పష్టంచేస్తున్నారు. రిజర్వేషన్ల అంశంపై ఇప్పటికే కోర్టుకు వివరించామని పేర్కొంటున్నారు. ఈ నెల 27 నుంచి జనవరి 2 మధ్యలో ప్రిసైడింగ్ ఆఫీసర్లకు శిక్షణ ఇవ్వనున్నారు. మూడువందల వరకు జనాభా ఉన్న ఒక్కో పంచాయతీకి సాధారణంగా వివిధ రూపాల్లో వచ్చే నిధులు రూ.ఏడెనిమిది లక్షల వరకు ఉంటాయి. మంత్రులో, ఎమ్మెల్యేలో కొంత ప్రేమ చూపిస్తే మరిన్ని నిధులు వస్తాయి. పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవం అయితే ఆ గ్రామానికి ప్రభుత్వం రూ.10 లక్షల నజరానా ఇస్తుంది. ఈ నిధులను గ్రామాభివృద్ధికి వినియోగించుకోవచ్చు. రాష్ట్రంలో 4,383 కొత్త గ్రామాలు ఆవిర్భవించాయి. వీటిలో 2,551 గ్రామాలు పూర్తిగా తండాలు, శివారు గ్రామాలే. వీటికి సరైన రోడ్డు సౌకర్యం కూడా లేదు. ఇంతకాలం ఏదో పంచాయతీలో భాగంగా ఉండటంతో వీటిని పట్టించుకొనేవారే లేకుండాపోయాడు. ఈ నేపథ్యంలోనే మావ నాటే.. మావ రాజ్ అంటూ గిరిపుత్రులు ఆందోళనలకు దిగిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మా తండాల్లో మా రాజ్యం కావాలని ఆందోళనలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త గ్రామ పంచాయతీరాజ్ చట్టం ద్వారా తండాలను, గూడేలను గ్రామపంచాయతీలుగా ఏర్పాటుచేసి నూతన శకానికి శ్రీకారంచుట్టారు. ఇప్పుడు గ్రామాలుగా మారిన తండాలు తమ అభివృద్ధి కోసం ఎవరిపైనో ఆధారపడనక్కరలేదు. రాబోయే ఎన్నికల్లో ఏకగ్రీవంగా తమ ప్రతినిధులను ఎన్నుకోవడం ద్వారా అదనపు నిధులను రాబట్టుకొని అభివృద్ధిలో ఇతర గ్రామాలతో పోటీ పడాలని పల్లెల్లో ప్రజలు భావిస్తున్నారు. రాజకీయాలు లేకుం డా.. ఏకగ్రీవంగా సర్పంచ్, పాలకవర్గాలను ఎన్నుకునేందుకు యువతీయువకులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఓటర్లకు, కులపెద్దలకు అవగాహన కల్పిస్తున్నారు. ఏకగ్రీవమైతే గ్రామానికి రూ.10 లక్షల ప్రోత్సాహక నజరానా వస్తుందని, దీంతో అభివృద్ధి ఎక్కువ చేసుకోవచ్చని వివరిస్తున్నారు. ఇప్పటికే తమ తండాలు, గ్రామాలు అభివృద్ధిలో వెనకబడ్డాయని, ఇప్పుడు అందరం ఒక్కతాటిపై ఉండి గ్రామాభివృద్ధి చేసుకోవాలని ప్రచారం చేస్తున్నారు. గ్రామాభివృద్ధికి కట్టుబడి ఉండి, పనులు చేసేవారిని ఎన్నుకుందామంటూ తీర్మానాలు చేస్తున్నారు. 2013లో జరిగిన ఎన్నికల్లో 541 గ్రామాలు ఏకగ్రీవమయ్యాయి. వాటికి తెలంగాణ ప్రభుత్వం రూ.10 లక్షల చొప్పున ప్రోత్సాహకాన్ని అందించింది. ఈసారి కూడా చిన్నా, పెద్ద తేడా లేకుండా ఏ గ్రామమైనా ఏకగ్రీవమైతే.. రూ. 10 లక్షలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. జిల్లా, మండల, గ్రామ స్థాయిలో జరుగాల్సి ఉంటుంది. డిసెంబర్ నెలాఖరు వరకు రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తిచేసి ఎన్నికల సంఘానికి అందించాలని పంచాయతీరాజ్ శాఖ అధికారులు భావిస్తున్నారు. అన్ని సవ్యంగా సాగితే జనవరి మొదటివారంలో షెడ్యూల్ నోటిఫికేషన్ వెలువడే అవకాశాలున్నాయి