social
రుతుస్రావం అంతుపట్టని రకరకాల బాధలు
Kalinga Times, Hyderabad: రుతుస్రావమనే జీవధర్మం అగ్రశ్రేణి జీవజాతుల్లో సర్వ సాధారణం. ఇందుకు మానవజాతి కూడా మినహాయింపు కాదు. అయితే ఇతర జీవజాతుల్లో రుతుస్రావ సమయంలో గర్భకోశంలోని పొరలు ఉబ్బినట్లయి, కృశించిపోతుంటే, స్త్రీలలో మాత్రం ఈ గర్భకోశంలోని పొరలు ఊడిపోయి బహిర్గతమవ్ఞతుంటాయి. యుక్తవయస్సునుంచి కనిపిస్తూ, వయస్సు మళ్లే సమయంలో అదృశ్యమయ్యే రుతుస్రావాలు గర్భవతుల్లోను, బాలింతల్లోను, ప్రసవానంతరం కొన్ని నెలల వరకూ కనిపించవు.ఇదంతా ప్రకృతి నియమం.
స్త్రీ శరీరంలో ఎన్నో వ్యవస్థల సమన్వయంతో జరుగుతున్న ఈ సంక్లిష్ట ప్రక్రియను రెండు దశలుగా విభజించుకోవచ్చు. అండాశయాల వల్ల క్రమంగా అండం పరిపక్వత చెంది బయటకు విడుదలయ్యే దశ ప్రథమ దశ. దీన్నే శాస్త్రీయంగా ఫాలిక్యులార్ ఫేజ్ అంటారు. రుతుస్రావం మొదలైన రోజునుండి 14వ రోజు వరకు ఈ దశ ఉంటుంది. తదనంతరం 28వ రోజు వరకు అంటే మరల రుతుస్రావం కనిపించేంత వరకు ఉండే ద్వితీయ దశ ల్యూటియల్ ఫేజ్. రుతు స్రావాలు సహజమే అయినా, అవి బహిర్గతమయ్యేందుకు కొన్ని రోజుల ముందు స్త్రీలలో అధిక సంఖ్యాకులు కొంతమేర అసౌకర్యానికి శారీరక మానసిక బాధలకు లోనవుతారు. చాలామంది స్త్రీలు నెలసరికి కొన్ని రోజుల ముందు క్రమం తప్పకుండా కొన్ని బాధలతో నరకయాతన అనుభవిస్తుంటారు. ఎందుకో, ఏమిటో తెలి యని ఫలానా వ్యాధి అని చెప్పడానికి వీలులేని వ్యాధి నిర్ధారణ పరీక్షలకు అంతుపట్టని రకరకాల బాధలు ఈ సమయంలో కలగడం గమనార్హం.
మానసిక లక్షణాలు
అకారణంగా గొడవ పెట్టుకోవడం, విసుగు, చికాకు, అసహనం, కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉండలేకపోవడం, చీటికి మాటికి ఘర్షణలు, తగాదాలు, ఉద్రేకాలకు లోనుకావడం, ఒక్కొక్క ఆహార పదార్థంపై విపరీతంగా ఇష్టం, చిన్న చిన్న విషయాలకే ఏడవాలనిపించడం, సరైన నిర్ణయం తీసుకోలేకపోవడం, పని మీద శ్రద్ధ తగ్గడం, మూడ్ మాటిమాటికీ మారుతుండటం, ఆలోచించిన విషయాన్నే మరలా మరలా ఆలోచించటం, భద్రత లేనట్లు భావన, సమాజానికి దూరంగా ఉండేందుకు ఇష్టపడటంలాంటివి.
శారీరక లక్షణాలు
కడుపు ఉబ్బరం, కడుపు బరువెక్కినట్లు ఉండటం, పొత్తి కడుపులో బాధ, విరేచనాలు లేదా మలబద్ధకం, కాళ్లు, చేతులు వాచినట్లు ఉండ టం, శరీరం బరువెక్కినట్లు ఉండటం, రొమ్ములు బరువెక్కినట్లు ఉండి, సలుపు, పోటు, నొప్పి, అతి ఆకలి, వాంతి వచ్చినట్లు అనిపిం చడం, వాంతులు కావడం, తల నొప్పి, తల తిరగడం, గుండె దడ, శరీరంపై అలర్జీకి సంబంధించిన ఎర్రటి పొక్కులు, దురదలు, మొటిమలు, అతి నిద్ర లేదా నిద్ర పట్టకపోవడం, చెవుల్లో శబ్దాలు మొదలైనవి. రుతు స్రావానికి కొన్ని రోజుల ముందునుంచి కలిగే పైన చెప్పుకున్న మానసిక శారీరక లక్షణాలలో ఆయా వ్యక్తుల్లో వ్యక్తమయ్యే కొన్ని లక్షణాల సముదాయాన్ని శాస్త్రీయంగా ప్రీ మెన్‌స్ట్రువల్ సిండ్రోమ్ (పి.ఎం.ఎస్.)గా వ్యవహరిస్తారు.
సాధారణంగా నెలసరి 28 నుంచి 30 రోజుల్లోపు వచ్చేస్తుంది. కొన్ని సందర్భాల్లో రెండు, మూడు రోజులు అటుఇటుగా వస్తుంది. దానికి పెద్ద కంగారు పడాల్సిన అవసరం లేదు కానీ అలా కాకుండా 40 రోజులు దాటినా రాకుండా ఉండటం లేదంటే మూడు వారాలకన్నా ముందే రావడం జరుగుతుంది. అలాంటి వాళ్లు మాత్రం కచ్చితంగా డాక్టర్లను సంప్రదించాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు.
హార్మోన్ల అసమతుల్యత కారణంగా నెలసరి సమయానికి రాకపోవడానికి ఒక కారణం కావొచ్చు. అలా కాకుంటే జన్యుపరమైన కారణాలు కూడా ఉండే అవకాశం ఉంది. వ్యాధి నిరోధక వ్యవస్థ లోపాలతో పాటు మరిన్ని ఇబ్బందుల వల్ల కూడా ఈ సమస్య ఎదురుకావొచ్చు.
బరువు విపరీతంగా పెరిగినా, తగ్గినా కూడా నెలసరి ఆలస్యం కావొచ్చు. చదువుల ఆందోళన, ఉద్యోగంలో ఒత్తిడి, కుటుంబ పరిస్థితులు ఇలా కారణం ఏదైనా దాని ప్రభావంతో అమ్మాయిల్లో నెలసరి ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. సరైన పోషకాహారం తీసుకుండా విపరీతంగా డైట్ ఫాలో అయ్యేవారిలో కూడా ఈ సమస్య తలెత్తుంది.
థైరాయిడ్ లోపాలు, ఎడ్రినల్ గ్రంథి, పిట్యూటరీ గ్రంథి కి సంబంధించిన సమస్యలు ఉన్నా కూడా నెలసరి క్రమం తప్పుతుంది. క్రోమోజోముల లోపాలు ఉన్న స్త్రీలకు అండాల నిల్వ ఉండదు. ఒక్కోసారి అండాశయాలు కూడా తయారు కావు. గర్భాశయం చిన్నగా ఉన్నవారికి కూడా నెలసరి సరిగా రాదు. కాబట్టి సమస్య ఏంటో తెలుసుకోని వైద్యులతో చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది.
నెలసరి క్రమం తప్పకుండా రావాలి అంటే బరువు మరీ పెరగకుండా మరీ తగ్గకుండా చూసుకోవాలి. పోషకాహారం తీసుకుంటూ, వ్యాయామం చేయడం వల్ల నెలసరి సక్రమంగా వస్తుంది. సమస్య పెద్దది కానప్పుడు కొన్ని నెలలపాటు హార్మోన్లను క్రమబద్ధీకరించేందుకు గర్భనిరోధక మాత్రలు వాడితో సరిపోతుంది.