Andhra Pradesh
కృష్ణలంక ముంపు ప్రాంతాల్లో పర్యటించిన ఏపీ మంత్రులు
Kalinga Times,Vijayawada :ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు, వరదలకు వాగులు, వంకలన్నీ పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రకాశం బ్యారేజీకి కూడా భారీ ఎత్తున వరద నీరు చేరుకుంటోంది. వరద తాకిడితో పలు ప్రాంతాలు నీట మునిగిన నేపథ్యంలో ఏపీ మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, కొడాలి నాని, పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాస్ ఈరోజు కృష్ణలంక ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. బాలాజీనగర్, గీతానగర్, తారకరామానగర్ లో బాధితులను పరామర్శించారు.ఈ సందర్భంగా మంత్రి అనిల్ మాట్లాడుతూ.. ప్రస్తుతం ఎగువ నుంచి రోజుకు 7 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం వస్తోందని తెలిపారు. వరద కారణంగా కృష్ణలంక ప్రాంతంలో ఇళ్లు కొన్నిచోట్ల పూర్తిగా, మరికొన్ని చోట్ల పాక్షికంగా మునిగిపోయాయని వెల్లడించారు. ఈ నేపథ్యంలో పునరావస కేంద్రాలను ఏర్పాటు చేశామనీ, 3 వేల మందికిపైగా అందులో ఆశ్రయం పొందుతున్నారని చెప్పారు. ప్రస్తుతం వరద క్రమంగా తగ్గుతోందనీ, త్వరలోనే నీటి ప్రవాహం తగ్గుముఖం పడుతుందని ధీమా వ్యక్తం చేశారు. అధికారులతో పాటు తాము సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నామని పేర్కొన్నారు.