Religious
అత్తివరదస్వామి స్వామి తిరిగి జలప్రవేశం
Kalinga Times,Sri Kanchipuram : ప్రతి 40 ఏళ్లకు ఒక్కసారి దర్శనమిచ్చే కంచిలోని అత్తివరదస్వామిని ఈ ఏడాది జులై 1న జలం నుంచి జనంలోకి వచ్చారు. 48 రోజుల పాటు లక్షలాది మంది భక్తులు స్వామిని దర్శించుకున్నారు. శుక్రవారం (ఆగస్టు 17)న స్వామి తిరిగి జలప్రవేశం చేయనున్నారు. 31 రోజులు శయన రూపంలోను 17 రోజులు స్థాన మూర్తిగా నిల్చొని దర్శనమిచ్చారు. శ్రీ మహావిష్ణువు చిద్విలాసమూర్తిగా వరాలనొసిగే వరదరాజ పెరుమాళ్ల ఆలయం ఈ 48 రోజులు నిత్యం లక్షలాది మంది భక్తులతో పులకించిపోయింది. చారిత్రక నేపథ్యం పరిశీలిస్తే 16 శతాబ్దంలో అత్తివరదరాజస్వామి విగ్రహానికి గర్భగుడిలోనే పూజలు చేసేవారు. నాటి ముస్లిం పాలకులు హిందూ ఆలయాలపై దాడిచేసి విగ్రహాలను ధ్వంసం చేసేవారు
.
వారి బారి నుంచి కాపాడటానికి స్వామివారిని అర్చకులు ఆలయ కోనేరు అనంత పుష్కరిణిలో ఎవరికీ తెలియకుండా భద్రంగా దాచారు. ఆలయ ధర్మకర్తలకు సైతం విగ్రహాన్ని ఎక్కడ దాచారో చెప్పలేదు. కొన్నేళ్ల తర్వాత పుష్కరిణిలో విగ్రహం దాచిన అర్చకులు మరణించారు. ముప్పు తొలగిన తర్వాత అప్పటి ఆలయ అర్చకులకు ఎంత వెదకినా విగ్రహం దొరకలేదు.
దీంతో గర్భగుడిలో మరో విగ్రహాన్ని శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించారు. ఆయనే ప్రస్తుత మూలవిరాట్ వరదరాజ స్వామి. స్వామి వారి దేవేరి పేరు పెరుందేవి. అంటే మహాలక్ష్మి అని అర్థం. ఆలయ కోనేరు పేరు అనంత సరస్. ఇది జీవ పుష్కరిణి. ఎప్పుడూ నీటితో కళకళాడుతూ ఉంటుంది. ఆలయ పుష్కరిణిలో నాలుగు కాళ్ల మండపం ఉంటుంది. మండపం కింద భాగంలో బిలం వంటి ప్రదేశంలో అత్తి వరదరాజ స్వామి 40 ఏళ్ల పాటు జలవాసం చేస్తారు.
ఒకసారి ఆ పుష్కరిణిలో నీరు పూర్తిగా ఇంకిపోగా అప్పుడే కోనేటి గర్భంలో ఉన్న విగ్రహం బయటపడింది. ఒకే ఆలయంలో ఇద్దరు మూలవిరాట్‌లు ఉండటం ఆగమశాస్త్రం ప్రకారం నిషిద్ధం. అందుకే 40 ఏళ్లకోసారి కోనేటి నుంచి తీసి 48 రోజుల పాటు భక్తుల సందర్శనార్థం ఉంచే సంప్రదాయం మొదలైంది. అత్తి వరదరాజ స్వామిని 1783లో కోనేటి నుంచి వెలికి తీసినట్లు ఆలయంలో ఉన్న తెలుగు శాసనం చెబుతోంది. 40 ఏళ్లకోసారి దర్శనం ఏర్పాటు చేసే సంప్రదాయం 1854 నుంచి కొనసాగుతున్నట్లు అప్పటి మీడియా కథనాల ఆధారంగా తెలుస్తోంది.
1892, 1937, 1979 తర్వాత ఈ ఏడాదిలో మళ్లీ ఈ మహా క్రతువును నిర్వహించారు. 1977-78లో రాజగోపురం నిర్మాణ పనుల వల్ల ఈ క్రతువు రెండేళ్లు ఆలస్యమైంది.