Telangana
వరద ముంపు ప్రాంతాలలో మంత్రి ఈటల పర్యటన

Kalinga Times , Karim Nager : ఉత్తర తెలంగాణ జిల్లాలలో వరద ముంపు ప్రాంతాలలో మంత్రి ఈటల రాజేందర్ పర్యటించారు..కొన్ని ప్రాంతాలలో ఆయన బైక్ పై పర్యటించి ప్రజలతో మాట్లాడాడు.. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, “కరీంనగర్, వరంగల్ .. కొన్ని ప్రాంతాల ఖమ్మం జిల్లా, ఆదిలాబాద్ జిల్లాలో పెద్ద ఎత్తున వర్షాలు కురిశాయి, ఈ వర్షాలతో వాగులు వంకలు పోగడమే కాకుండా చెరువులు నిండి ఉన్నాయి. చాలా గ్రామాలకు రవాణా సౌకర్యాలు బంద్ అయ్యాయి. ఇంత పెద్ద ఎత్తున, ఇంత తక్కువ కాలంలో వర్షం పడటం అరుదుగా జరుగుతుంది. తెగిపోయిన చెరువులు, మునిగిపోయిన పంటపొలాలు, కూలిపోయిన ఇళ్ళ విషయంలో ఇప్పటికే ఆయా జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో ఇరిగేషన్, వ్యవసాయ ,రెవెన్యూ అధికారులు పర్యటించి నష్ట అంచనాలు వేస్తున్నారు. జరిగిన సంఘటన అన్నింటిని పరిశీలించి వరద తగ్గిన తర్వాత సహాయ చర్యలు సహాయ సహకారాలు అందిస్తాము. ఇప్పుడు వెంటనే ఇబ్బంది పడుతున్న ప్రజలందరికీ ఆహారాన్ని కావలసిన సహకారాలు అందిస్తాము. రైతాంగానికి పంట నష్టం పై ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకొని ప్రకటిస్తారు. ఇప్పటికే రెండు కమాండ్ కంట్రోల్ సెంటర్లు ఏర్పాటు చేశాం. సిఎస్ ఆధ్వర్యంలో కంట్రోల్ సెంటర్ నడుస్తుంది. అన్ని జిల్లాల కలెక్టర్లతో సమాచారం సేకరించి ప్రత్యేక బృందాలు పంపిస్తున్నారు. అవసరం ఉన్నంచోట ప్రజలను షెల్టర్ లకు తరలించి భోజన సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారు. రాబోవు 48 గంటల్లో మరోమారు తీవ్రమైన వర్షాలు ఉంటాయని హెచ్చరికల నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాం. ప్రభుత్వం సిద్ధంగా ఉంది.. అధికారులకు తోడుగా ప్రజాప్రతినిధులు కూడా రంగంలోకి దిగి సహాయం అందించాలి “అని కోరారు..కాగా, వరంగల్ మహానగరంలో వరద ఉధృతి కొనసాగుతున్నది. ఎడతెరపి కురిసిన వర్షాలకు నగరం అతలాకుతలం కాగా, లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అధికార యంత్రాంగం అంతా సహాయక, పునరావాస చర్యల్లో వేగం పెంచింది. జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ పర్యటించారు.