
Kalinga Times,Hyderabad : గ్యాంగ్ స్టర్ నయీంతో పలువురు పోలీసులు, పొలిటికల్ లీడర్లకు లింకులు ఉన్నట్లు ఆర్టీఐ వెల్లడించింది. నయీం కేసు వివరాలపై ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ఆర్టీఐకి దరఖాస్తు చేసుకుంది. ఈ నేపథ్యంలో ఆర్టీఐ ఇచ్చిన వివరాలలో పలు సంచలన విషయాలు ఉన్నాయి. నయీం కేసులో మాజీ ఎమ్మెల్యేలు, వివిధ పార్టీలకు చెందిన నాయకులు, ఏఎస్పీ, డీఎస్పీ, సీఐలకు సంబధాలు ఉన్నట్లు ఆర్టీఐ సమాచారం ద్వారా తెలుస్తున్నది. వీరిలో అధికార టీఆర్ఎస్ కు చెందిన 16 మంది నేతలు, అలాగే 21 మంది పోలీసు అధికారులకు సంబంధం ఉందని ఆ సమాచారం పేర్కొంది. వీరిలో బీసీ సంఘాల నేత, మాజీ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య పేరు కూడా ఉండటం కలకలం రేపుతోంది. ఆయనతో పాటు పలువురు పోలీసు అధికారులు, మాజీ జెడ్పీటీసీ, ఎంపీపీ, సర్పంచ్ ల పేర్లు కూడా ఉన్నాయి. ఈ కేసులో అడిషనల్ ఎస్పీలు శ్రీనివాసరావు, చంద్రశేఖర్, అమరేందర్ రెడ్డి, డీఎస్పీలు సాయి మనోహర్ రావు, శ్రీనివాస్, ప్రకాశ్ రావు, వెంకటనర్సయ్య, పంజాగుట్ట ఏసీపీ తిరుపతన్న,. సీఐలు మస్తాన్, శ్రీనివాసరావు, మాజీద్, వెంకట్ రెడ్డి, వెంకట సూర్య ప్రకాశ్, రవికిరణ్ రెడ్డి, బల్వంతయ్య, బాలయ్య, రవీందర్, నరేందర్ గౌడ్, దినేశ్, సాధిక్ మియాల పేర్లనూ అధికారులు చేర్చారు. ఈ జాబితాలో పలువురు టీఆర్ఎస్ నేతల పేర్లు కూడా ఉండటం గమనార్హం. భువనగిరి కౌన్సిలర్ అబ్దుల్ నాజర్, మాజీ కౌన్సిలర్ శ్రీనివాస్, మాజీ జెడ్పీటీసీ సుధాకర్, మాజీ ఎంపీపీలు నాగరాజు, వెంకటేశ్ మాజీ సర్పంచ్ పింగళ్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ సంజీవ, వెల్దండ టీఆర్ఎస్ ప్రెసిడెంట్ ఈశ్వరయ్య పేర్లు ఉన్నాయి.