Telangana
ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ముఖేష్ గౌడ్ మృతి
ప్రజల సందర్శనార్థం గాంధీ భవన్‌లో ముఖేష్ గౌడ్ పార్థీవదేహం
Kalinga Times,Hyderabad : కాంగ్రెస్ సీనియర్ నేత ముఖేష్ గౌడ్ కన్నుమూశారు. అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ముఖేష్ గౌడ్ (60) మృతి చెందారు. కొంతకాలంగా ఆయన కేన్సర్‌తో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండటంతో కుటుంబసభ్యులు ఆయనను అపోలో ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ కన్నుమూశారు.
కాంగ్రెస్ నేతలు సంతాపం
మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత ముఖేష్ గౌడ్ మృతి పట్ల కాంగ్రెస్ నేతలు సంతాపం తెలిపారు. జూబ్లీహిల్స్ లోని అపోలో ఆస్పత్రిలో ముఖేష్ భౌతికకాయానికి కాంగ్రెస్ నేతలు గులాం నబీ ఆజాద్, మల్లికార్జున ఖర్గే, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జానారెడ్డి, వంశీచందర్ రెడ్డి, సంపత్ కుమార్, పొన్నాల లక్ష్మయ్య, గూడూరు నారాయణరెడ్డి, తదితరులు సంతాపం తెలిపారు. ముఖేష్ గౌడ్ కుటుంబ సభ్యులను కాంగ్రెస్ నేతలు పరామర్శించారు. అదలావుంటే ఆయన పార్థీవదేహాన్ని ప్రజల సందర్శనార్థం మంగళవారం నాడు ఉదయం 10 నుంచి 11 గంటల వరకు నాంపల్లిలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గాంధీ భవన్‌లో ఉంచనున్నారు.ఉదయం 11 గంటల తర్వాత అంతిమయాత్ర ప్రారంభం కానుంది. ఆ తర్వాత మధ్యాహ్నం మూడు గంటల సమయంలో షేక్‌పేట గౌడ సమాజ్‌లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఆ మేరకు కుటుంబ సభ్యులు వివరాలు వెల్లడించారు.