Telangana
పురిటిగడ్డ లో కేసీఆర్ ..ఊర్లో పండుగ వాతావరణం
Kalinga Times,Chintamadaka : సిద్దిపేట రూరల్ మండలం చింతమడక గ్రామానికి సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చారు. ఆయన రాకతో ఆ ఊర్లో పండుగ వాతావరణం నెలకొంది. అందరినీ అప్యాయంగా పలుకరించిన కేసీఆర్ అక్కడ ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ రాష్ట్రంలో రైతులకు అనేక సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. గుంట భూమి ఉన్న రైతుకు కూడా బీమా వర్తింపజేస్తున్నామని చెప్పారు. చింతమడక గ్రామం చుట్టూ చెరువులు ఉన్నాయని, మూడు పంటలు పండే గ్రామంగా చింతమడక తయారవుతుందన్నారు. రాష్ట్రంలో కరెంట్, నీటి సమస్యలు తీరాయని కేసీఆర్ అన్నారు.
చింతమడకలోని ప్రతి కుటుంబానికి రూ.10 లక్షలు లబ్ధి పొందే పథకానికి శ్రీకారం చుడుతామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. చాలా కాలం తర్వాత నా కోరిక నెరవేరుతుంది. రైతుబంధు, రైతుబీమా సౌకర్యం కల్పించిన రోజు చాలా సంతోషపడ్డాను. మన రాష్ట్రంలో ఆలోచించినట్లు దేశంలో రైతుల గురించి ఆలోచించడం లేదు. ఈ పథకాలు పేద కుటుంబాలకు అండగా ఉన్నాయి. అంతకుముందు చింతమడక చేరుకున్న సీఎం కేసీఆర్ గ్రామంలో పెద్దమ్మ దేవాలయం, శివాలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. చింతమడక గ్రామస్తులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. కాగా చింతమడకలో కేసీఆర్ పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.