Telangana
67 కొత్త నేతలపై కేసులు

లోకల్ న్యూస్ హైద్రాబాద్ ; తెలంగాణ అసెంబ్లీలో అడుగుపెట్టే సగం మంది శాసన సభ్యులపై కేసులున్నాయనీ, కేసులున్న వారు ఇంత మంది అసెంబ్లీలో అడుగు పెట్టడం ఇదే మొదటిసారనీ ఫోరం ఫర్‌గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి యం.పద్మనాభరెడ్డి తెలిపారు. తెలంగాణ అసెంబ్లీలో మొత్తం 119 అసెంబ్లీ స్థానాలుండగా, 67 మంది శాసన సభ్యులపై కేసులు నమోదైనట్టు తెలిపారు. మొదటిసారిగా రాష్ట్ర శాసనసభలో సగం కంటే అధికంగా శాసనసభ్యులపై కేసులున్న వారు అడుగు పెడుతున్నారన్నారు. టీఆర్‌ఎస్‌కు చెందిన 88 మంది శాసనసభ్యుల్లో 44 మందిపై కేసులున్నాయన్నారు. బీజేపీ నుంచి ఎంపికైన శాసనసభ్యునితోపాటు కూటమి అభ్యర్థులు 21 మందిలో 16 మందిపై కేసులున్నట్టు తెలిపారు. ఎంఐఎంకు చెందిన ఏడుగు శాసనసభ్యుల్లో 6 మందిపై కేసులున్నాయన్నారు. 90వ దశకం నుంచే నేరచరిత్ర గల వారు చట్టసభల్లో ప్రవేశించడం మొదలైందన్నారు. అప్పటి నుంచి ధనం, మద్యం వంటి ప్రలోభాలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం జరుగుతూ వచ్చిందని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే నేడు సగానికిపైగా శాసనసభ్యులపై ఏదో ఒక కేసు నమోదై ఉందన్నారు. ఈ పద్ధతి ఇలాగే కొనసాగితే మంచి పరిణామం కాదన్నారు. ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థులు తమపై ఉన్న కేసుల గురించి ప్రసార మాధ్యమాల ద్వారా తెలపాలని సుప్రీం కోర్టు ఆదేశించినా చాలా మంది అభ్యర్థులు ఆ ఆదేశాలను పాటించడం లేదన్నారు.