social
కాకితో వాలిపోతూ .. భారీగానే డబ్బుల సంపాదన
Kalinga Times,New Delhi : పట్టణీకరణ వేగవంతమవుతున్న తరుణంలో కాకుల జాడ కానరాకపోవడం ఉత్తర ప్రదేశ్ లోని ప్రశాంత్ పూజారి అనే యువకుడిని కదిలించింది. దాంతో కాకిని తనకు ఉపాధిమార్గంగా మలచుకున్నాడు. దానికోసం కాకిని పెంచుకుంటూ పిండప్రదానాలకు, వైకుంఠ సమారాధనలకు కాకితో వాలిపోతూ కాసిన్ని డబ్బులు సంపాదించుకుంటున్నాడు. దాన్నే వృత్తిగా మలచుకుని హ్యాపీగా ఫీలవుతున్నాడు. అంతేకాదు ఈ విషయం అందరికీ తెలిసిలా సోషల్ మీడియా వేదికను వాడుకుంటున్నాడు. పిండప్రదానాలకు, సమారాధనలకు కాకి లభించును అంటూ ఫేస్‌బుక్‌లో పోస్టు చేశాడు. అలా క్రమంగా ప్రశాంత్ పూజారి ఆలోచన వర్కవుట్ అవుతోంది. కొన్ని సందర్భాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ ఉంటుండటం విశేషం. అంతేకాదు ఎవరికైతే అవసరముంటుందో వాళ్లే కారులో తీసుకెళ్లడం, దింపడం చేస్తున్నారట. అలా 500 రూపాయల నుంచి 3 వేల 500 రూపాయల వరకు ఛార్జీ చేస్తున్నాడట.
కాకి వ్యాపారం ప్రస్థానం ఎలా మొదలైందో ప్రశాంత్ పూజారి కొన్ని వివరాలు వెల్లడించాడు. అప్పుడెప్పుడో తమ ఇంటి ఎదురుగా ఉండే చెట్టు మీద నుంచి మూడు కాకి పిల్లలు కింద పడ్డాయట. వాటిని చేరదీసి సంరక్షించే క్రమంలో రెండు కాకులు చనిపోగా ఒక్కటి మాత్రమే బతికిందట. ఆ కాకికి రాజా అని ముద్దుపేరు పెట్టుకుని పెట్‌లాగా పెంచుకుంటున్నాడట. ప్రశాంత్ పూజారి ఇంటి సమీపంలో ఉండే యువకుడు కొద్దిరోజుల కిందట రోడ్డుప్రమాదంలో చనిపోతే మూడో రోజు పిండప్రదానం సందర్భంగా కాకి రాలేదు. చనిపోయిన వ్యక్తి పేరిట పెట్టిన ఆ వంటకాలు ముట్టలేదు. దాంతో కుటుంబ సభ్యులు తీరని వేదనకు గురయ్యారు. ఆ క్రమంలో 11వ రోజు వైకుంఠ సమారాధనకు కూడా ఇలాగే జరిగితే ఎట్లా అని విచారించే సమయంలో ఒకతను ప్రశాంత్ పూజారి గురించి చెప్పారు. అలా తన కాకితో వాలిపోయి ఆ తంతు ముగించాడట. ఇక అక్కడి నుంచి వెనుదిరిగి చూడలేదట. అలా ప్రజల అవసరాలు తీర్చుతూ అదే కాకిని ఉపాధిమార్గంగా మలచుకున్నాడు ప్రశాంత్. కాకులు లేని ఆ ప్రాంతంలో ఇతగాడికి మంచి డిమాండ్ పెరగడం విశేషం.