Telangana
పురపాలక చట్టం కోసం అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు
Kalinga Times,Hyderabad : సీఎం కేసీఆర్ అధ్యక్షతన బుధవారం ప్రగతి భవన్లో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఐదు గంటలకుపైగా ఈ సమావేశం కొనసాగింది. కొత్త పురపాలక చట్టం బిల్లుపై సుదీర్ఘంగా చర్చించిన తర్వాత..ఆ బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కొత్త పురపాలక చట్టం తీసుకొచ్చేందుకు గురు, శుక్రవారాల్లో అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు పురపాలకశాఖ సిద్ధంచేసిన ముసాయిదా బిల్లుకు న్యాయశాఖ ఆమోదం కూడా లభించింది. క్యాబినెట్ లో ఆమోదించిన బిల్లును ఈ నెల 18న అసెంబ్లీలో ప్రవేశపెడతారు. 19న ఆమోదం పొందనున్నారు. అదేరోజు కౌన్సిల్లోనూ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదం పొందనున్నారు.దీంతో పాటు వృద్ధాప్య ఫించన్ వయో పరిమితిని 57 ఏళ్లకు తగ్గించింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తగ్గిస్తున్నట్టు పేర్కొంది. 57 ఏళ్లు నిండిన పేద వృద్ధుల జాబితాను రూపొందించి పింఛన్ అందజేయాలని అధికారులకు దిశానిర్దేశం చేసింది. బీడీ కార్మికుల పీఎఫ్ కటాఫ్ తేదీని తొలగించాలని కూడా మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి ఫించన్ అందజేయాలని స్పష్టంచేసింది దీనికి సంబంధించి ఈ నెల 20న పింఛన్ల ప్రొసిడీంగ్స్ను లబ్ధిదారుకు అందజేయాలని ఆదేశించింది.