Telangana
అన్నారం ప్రాజెక్ట్ సుందరశాల వద్ద జలజాతర
Kalinga Times, Chennur : కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం దేశంలోనే చరిత్రను సృష్టించిందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డిలు అన్నారు. మంగళవారం అన్నారం ప్రాజెక్ట్ సుందరశాల వద్ద ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జలజాతరకు జనం పెద్దఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రులు కొప్పుల ఈశ్వర్, అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డిలు మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణాన్ని అడ్డుకునేందుకు అడుగడునా ఇబ్బందులు కల్గించారని, ముఖ్యమంత్రి కేసిఆర్ ఎవరి వ్యతిరేకతకు తలొగ్గక కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణాన్ని మూడు సంవత్సరాల్లోనే పూర్తి చేసి దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా కీర్తి సాధించారని అన్నారు. కోటి ఎకరాలకు నీరు అందించే ఈ ప్రాజెక్ట్‌ను యుద్ధప్రాతిపదికన నిర్మించిన కేసిఆర్‌కు యావత్ తెలంగాణ ప్రజలు రుణపడి ఉంటారని, ప్రతిపక్ష నాయకులు కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను ఇప్పుడు సందర్శించినట్లయితే జలకళ విషయం అర్థమవుతుందని అన్నారు.అనంతరం ఎమ్మెల్యే బాల్క సుమన్ మాట్లాడుతూ రాష్ట్ర సాధనకు కేసిఆర్ ప్రాణత్యాగాని కూడా వెనుకాడకుండా కృషి చేశారని అనంతరం ప్రజల మన్ననలను పొంది రెండు సార్లు ముఖ్యమంత్రిగా పదవులు చేపట్టి కేవలం మూడు సంవత్సరాల్లో ప్రాజెక్ట్‌ను పూర్తి చేసి ప్రపంచ దేశాలు కాళేశ్వరం వైపు చూసేలా చేశారని అన్నారు. ఈ కార్యక్రమానికి మంచిర్యాల జిల్లా చైర్‌పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి, కుమ్రంబీం జిల్లా చైర్‌పర్సన్ కోవ లక్ష్మి, పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధు, ఎమ్మెల్సీలు నారదాసు లక్ష్మణ్‌రావు, పురాణం సతీష్‌కుమార్, మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు, సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, ఆసీఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి, రామగుండం కోరుకంటి చందర్ తదితర నాయకులతో పాటు కార్యకర్తలు పెద్దఎత్తున హాజరయ్యారు.