Andhra Pradesh
వాలంటీర్ల నియామకం కోసం గురువారం నుంచి ఇంటర్వూలు
Kalinga Times,Amaravati:ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా అమలు చేయ బోతున్న గ్రామ సచివాలయం వాలంటీర్ల నియామకం కోసం గురువారం నుంచి ఇంటర్వూలు నిర్వహించనున్నారు. మండల పరిషత్ కార్యాలయాల్లో గ్రామాల వారీగా ఇంటర్వూలు నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు అధికారులు తెలిపారు.ఎన్నికల వాగ్దానం అమలులో భాగంగా ఇప్పటికే గ్రామాల వారీగా దరఖాస్తులను అధికారులు తీసుకున్నారు. రాష్ట్రంలో 13,055 గ్రామ పంచాయితీలు ఉండగా 9,480 గ్రామ సచివాలయాల ఏర్పాటుకు అధికారులు నిర్ణయించారు. ఇందులో భాగంగా ఇప్పటికే ఉన్నత స్థాయిలో పలుమార్లు సమీక్ష నిర్వహించి విధి విధానాలు రూపొందించడంతో పాటు అభ్యర్థుల అర్హతను కూడా కుదించారు. ఇంటర్వూలకు వచ్చే అభ్యర్థులు ఒరిజినల్ ధృవీకరణ పత్రాలతో రావాల్సి ఉంటుంది. గ్రామాల వారీగా ముందస్తు విడుదల చేసిన షెడ్యూల్ మేరకు నివాస గుర్తింపు కోసం ఆధార్, ఓటరు గుర్తింపు, రేషన్ కార్డు, బ్యాంకు పాసు పుస్తకం తీసుకొని రావాల్సి ఉంటుంది. విద్యార్హతలకు సంబంధించి పదో తరగతి, ఇంటర్ సర్టిఫికెట్లు వెంటు తెచ్చుకోవాలి. ఇదే సమయంలో అదనపు అర్హతలు ఉంటే వాటిని కూడా తీసుకు రావడంతో పాటు కుల ధృవీకరణ పత్రం, దివ్యాంగులైన పక్షంలో మెడికల్ బోర్డు ఇచ్చిన ఒరిజినల్ సర్టిఫికెట్లు, జిరాక్స్‌లు తీసుకురావాల్సి ఉంటుందని అధికారులు చెపుతున్నారు. ఇంటర్వూలను ఈ నెల 23వ తేదీ వరకు నిర్వహించనున్నందున అధికారులు ఇచ్చిన షెడ్యూల్ మేరకు ఇంటర్వూలకు రావాల్సి ఉంటుంది