Telangana
మరోరెండు వేల ప్రభుత్వ స్కూళ్ళు మూసివేత యోచన
Kalinga Times,Godavarikhani : టిఆర్ఎస్ ప్రభుత్వం 4,000 పాఠశాలలను మూసివేసినట్లు తెలుస్తోంది.టిఆర్ఎస్ రెండవ సారి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఎక్కువ సంఖ్యలో పాఠశాలలు మూసి వేతకు గురవుతున్న పరిస్థితి ఉంది. ప్రభుత్వ పాఠశాలల మూసివేత పట్ల జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ ఆందోళన వ్యక్తం చేసింది. కాంగ్రెస్ నాయకుడు రణదీప్ సింగ్ సుర్జేవాలా సోషల్ మీడియా వేదికగా టిఆర్ఎస్ ప్రభుత్వం గత ఐదేళ్ళ కాలంలో 4,000 పాఠశాలలను మూసివేసిందని, మరో 2 వేల నుండి 3,000 పాఠశాలలు ఇప్పుడు తెలంగాణలో మూసివేత అంచున ఉన్నాయని వ్యాఖ్యానించారు. ‘కెసిఆర్ – సెక్రటేరియట్ భవనాలను కూల్చివేయటమే కాదు విద్యార్థులకు విద్యను అందించే పాఠశాలలను కూడా మూసివేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రణదీప్ సింగ్ సుర్జేవాలా ప్రస్తుత పరిస్థితిని గురించి తన పోస్ట్ లో తెలంగాణలో ప్రభుత్వం విద్యను సైతం సెక్రటేరియట్, అసెంబ్లీ భవనాల తరహాలో ద్వంసం చేసేందుకు కేసీఆర్ కంకణం కట్టుకున్నారని ఆరోపించారు.
ప్రస్తుత విద్యా సంవత్సరంలో తక్కువ శాతం విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలలో చదవటానికి ఆసక్తి చూపించని కారణంగా , విద్యార్థులు సంఖ్యా క్రమంగా తగ్గుతుంది. బడిబాట వంటి కార్యక్రమాలు సైతం ఫలితం ఇవ్వని పరిస్థితి. దీంతో తెలంగాణలోని 2,000 నుండి 3,000 వరకు ప్రభుత్వ పాఠశాలలు మూసివేసే ప్రమాదం కనిపిస్తుంది . తక్కువ నమోదు ఉన్న పాఠశాలల నుండి విద్యార్థులను సమీపంలోని ఇతర పాఠశాలలకు బదిలీ చేయమని రాష్ట్ర ప్రభుత్వం మౌఖిక సూచనలను ఇచ్చింది .
పాఠశాలలను మూసివేయడాన్ని అందరూ వ్యతిరేకిస్తున్నప్పటికీ , ఖండించినప్పటికీ, విద్యార్థులను బదిలీ చేసే కసరత్తు మాత్రం ఇప్పటికే ప్రారంభమైంది.ఇక విద్యా రంగ నిపుణులు సైతం తెలంగాణలో విద్యా వ్యవస్థలో ప్రస్తుతం ఉన్న పరిస్థితికి అసహనం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల సంఖ్యా పెరిగేలా చేసి అందరికీ విద్య అందించాల్సిన ప్రభుత్వం పాఠశాలల మూసివేత నిర్ణయం తీసుకోవటం వల్ల వెనుకబడిన ప్రాంతాల పిల్లలకు ప్రాథమిక విద్యను కోల్పోయే ప్రమాదం వుంటుంది. అందరికీ విద్య అందరిదీ బాధ్యత అనే విషయాన్ని గుర్తించి ప్రభుత్వం ముందుగా చొరవ తీసుకుని విద్యార్థుల సంఖ్య పెరిగేలా ప్రభుత్వ పాఠశాలలలో ప్రమాణాలు పెంచాలి . కానీ ఇలా మూసివేస్తే అందరికీ విద్య అందని ద్రాక్షే అవుతుంది.