
Kalinga Times : లీగ్ దశలో వరుస విజయాలతో దూసుకుపోయి పాయింట్స్ టేబుల్ లో టాప్ లో నిలిచిన టిమిండియా, కేవలం నెట్ రన్ రేట్ ఆధారంగా సెమీస్ కు చేరిన న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఇలా టాప్ జట్టుతో తలపడుతున్న తమ ఆటగాళ్లకు కివీస్ మాజీ కెప్టెన్ డానియల్ వెటోరి కొన్ని సలహాలు, సూచనలు చేశాడు.ఈ సందర్భంగా అతడు భారత యార్కర్ స్పెషలిస్ట్ జస్ప్రీత్ సింగ్ బుమ్రాతో జాగ్రత్తగా వుండాలని సూచించాడు. లీగ్ దశలోనే బుమ్రా చెలరేగాడు కాబట్టి సెమీస్ లో అతడు మరింత రెచ్చిపోయే అవకాశం వుంది. అతడిని ఎలా ఎదుర్కోవాలో తమ జట్టు ప్రణాళికలు రచిస్తే మంచిదే. ఒకవేళ అలా చేయకుంటే రేపటి మ్యాచ్ లో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని వెటోరి హెచ్చరించాడు. అద్భుతమైన బంతులతో ప్రత్యర్థులను బెంబేలెత్తించే బుమ్రా వల్లే కివీస్ కు ప్రమాదం పొంచివుందని పేర్కొన్నారు. అతడి నుండి వచ్చే బుల్లెట్లవంటి యార్కర్లను, వైవిధ్యమైన బంతులను ఎదుర్కోగలిగితే కివీస్ గట్టెక్కినట్లే. అందువల్ల తమ బ్యాటింగ్ లైనప్ బుమ్రాను ఎదుర్కోడానికి సిద్దమయ్యాకే బరిలోకి దిగితే బావుంటుందని వెటోరీ హెచ్చరించారు.