
బెంగాల్ మాల్దా జిల్లా హబీబ్‌పూర్‌లోని గిరిజ సుందరి విద్యా మందిర్. కో ఎడ్యుకేషన్ పాఠశాల కావడంతో అమ్మాయిలతో పాటు అబ్బాయిలు అక్కడ చదువుకుంటున్నారు. అయితే కొందరు విద్యార్థులు అమ్మాయిల పట్ల దురుసుగా ప్రవర్తించడంతో పాటు ఈవ్ టీజింగ్‌కు పాల్పడుతున్న ఘటనలు ఈ మధ్య కాలంలో పెరిగిపోయాయి. విద్యార్థినులు హెడ్ మాస్టర్‌కు తరుచూ కంప్లైంట్ చేస్తుండటంతో విసిగిపోయిన ఆయన బాలబాలికలిద్దరూ ఒకే రోజు స్కూల్‌కు రావొద్దని ఆదేశించారు. ఒకరోజు బాలికలు, మరో రోజు బాలురు పాఠశాలకు రావాలని తేల్చిచెప్పారు. ప్రశాంతంగా క్లాసులు స్కూల్ హెడ్ మాస్టర్ రవీంద్రనాథ్ పాండే తెచ్చిన ఈ రూల్ ప్రకారం సోమ, బుధ, శుక్రవారాల్లో బాలికలు, మంగళ, గురు, శనివారాల్లో బాలురు పాఠశాలకు రావాల్సి ఉంటుంది. అంటే విద్యార్థులు వారంలో కేవలం మూడు రోజులు మాత్రం స్కూల్‌కు వెళ్లాల్సి ఉంటుంది. ఈ విధానం అమల్లోకి తెచ్చాక ఈవ్ టీజింగ్ కంప్లైంట్లు తగ్గిపోయాయని హెడ్ మాస్టర్ అంటున్నారు. ఇప్పుడు ఎలాంటి గొడవలు, ఫిర్యాదులు లేకుండా క్లాసులు ప్రశాంతంగా జరుగుతున్నాయని చెప్పారు. వెల్లువెత్తుతున్న విమర్శలు ప్రభుత్వ పాఠశాలలో ఇలాంటి విధానం అమలు చేస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈవ్ టీజింగ్‌ను అడ్డుకునేందుకు ఇతర మార్గాలే లేవా అని విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. ఇలాగైతే తమ పిల్లలు సరిగా చదువుకోలేరని, వారంలో మూడు రోజుల పాటు వారిని చదువుకు దూరం చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. స్కూల్ యాజమాన్యం తీసుకున్న నిర్ణయంపై దుమారం రేగడంతో బెంగాల్ విద్యాశాఖ మంత్రి పార్థ ఛటర్జీ దర్యాప్తునకు ఆదేశించారు. ఇలాంటి నిర్ణయాలకు మద్దతిచ్చే ప్రసక్తేలేదన్న ఆయన.. ఒకవేళ నిజంగా ఇలాంటి నిబంధన అమలు జరుగుతుంటే వెంటనే దాన్ని రద్దుచేయాలని అధికారులను ఆదేశించారు.