Telangana
నలుగురు అక్కాచెల్లెళ్లు ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టడం
Kalinga Times జడ్చర్ల : మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండల కేంద్రంలో నలుగురు అక్కాచెల్లెళ్లు ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టడం చర్చానీయాంశమైంది. గురువారం నాడు జరిగిన ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది. ఒక కుటుంబంలో ఆరుగురు ఆడపిల్లలున్నారు. ఇంకా ఎవరికీ వివాహం కాలేదు. అయితే అందులో ఒక అమ్మాయి బుధవారం నాటి నుంచి కనిపించడం లేదు. ఆ యువతి జాడ దొరకక కుటుంబ సభ్యులు తీరని వేదనకు గురయ్యారు. చివరకు ఓ యువకుడితో సదరు యువతి వెళ్లినట్లు తెలిసింది. దాంతో ఆ కుటుంబం తీవ్ర మనస్తాపానికి గురైంది. తమకన్నా చిన్నదైన చెల్లె ఇంటి నుంచి అలా వెళ్లిపోవడం నలుగురు అక్కలు జీర్ణించుకోలేకపోయారు. కుటుంబం పరువు పోయిందని కలత చెందారు. ఆ క్రమంలో ఆ నలుగురు గదిలోకి వెళ్ళి పురుగుల మందు తాగారు. వారిని బాదేపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని గవర్నమెంట్ హాస్పిటల్‌కు తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.