Kalinga Times : బుధవారం సాయంత్రం 5 గంటల 30 నిమిషాల సమయంలో హైదరాబాద్‌లో దారుణ హత్య జరగడం కలకలం రేపింది. రోడ్లపై ఇద్దరు వ్యక్తులు పరుగులు పెట్టారు. ఒకరి చేతిలో కత్తి ఉండగా మరొక వ్యక్తి ప్రాణభయంతో కనిపించాడు. చివరకు కత్తిపోట్లకు గురైన వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో జరిగిన ఈ హత్య భయాందోళన రేకెత్తించింది. అటుగా వెళుతున్న వాహనదారులు, పాదచారులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు పెట్టారు. ఇద్దరు ఆటో డ్రైవర్ల మధ్య నెలకొన్న వివాదం ఒకరి ప్రాణాలు తీసింది. పంజాగుట్ట సమీపంలో నివసించే 32 ఏళ్ల అన్వర్ ఆటో డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు.
పత్రాప్ నగర్‌కు చెందిన 35 ఏళ్ల రియాసత్ అలీ కూడా కుటుంబ పోషణ కోసం ఆటో నడుపుతున్నాడు. వీరిద్దరు స్నేహితులు. అయితే వీరిద్దరి మధ్య గొడవలకు ఓ మహిళ కారణంగా తెలుస్తోంది. వెంటపడి.. వేటాడి! పేగులు బయటపడ్డా కూడా !
ఓ మహిళతో అక్రమ సంబంధం ఈ ఇద్దరు స్నేహితుల మధ్య చిచ్చు రాజేసినట్లు సమాచారం. ఆ క్రమంలోనే బుధవారం సాయంత్రం పంజాగుట్ట ఆటో స్టాండ్‌లో ఉన్న అన్వర్‌ను రియాసత్ అలీ టార్గెట్ చేశాడు. తన వెంట తెచ్చుకున్న కత్తితో అతడి పొట్టలో పొడిచాడు. ఊహించని పరిణామంతో షాక్‌కు గురైన అన్వర్ వెంటనే తేరుకుని ప్రాణభయంతో పరుగెత్తాడు. అన్వర్ అలా పరుగెత్తుతున్నా రియాసత్ అలీ వెంటపడి మరీ పొడిచాడు. ఎక్కడా లేని కసితో ఇష్టమొచ్చినట్లుగా దాడి చేశాడు. అన్వర్ అలా పరుగెత్తుకుంటూ సమీపంలోని పంజాగుట్ట ఏసీపీ కార్యాలయంలోకి వెళ్లాడు. అనంతరం పక్కనే ఉన్న పోలీస్ స్టేషన్‌కు వెళ్లి రిసెప్షన్ కౌంటర్లో కుప్పకూలిపోయాడు. అప్పటికే పేగులు బయటకొచ్చి తీవ్ర రక్తస్రావమైంది. అయినా కూడా పేగులు చేతబట్టుకుని పరుగెత్తడం అక్కడున్నవారిని కలచివేసింది. పోలీస్ స్టేషన్‌కు వెళ్లి కుప్పకూలిన బాధితుడు. అన్వర్ వెనకాలే పరుగెత్తుకొచ్చిన రియాసత్ అలీ పోలీసులకు లొంగిపోయాడు. అయితే కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్న బాధితుడిని కాపాడేందుకు పోలీసులు ప్రయత్నించారు. వెంటనే అంబులెన్స్ తెప్పించి ఆసుపత్రికి తరలించే క్రమంలో అతడు ప్రాణాలు విడిచాడు. విషయం తెలుసుకున్న అన్వర్ బంధుమిత్రులు పంజాగుట్టకు చేరుకుని కోపోద్రిక్తులయ్యారు. నిందితుడు రియాసత్ అలీకి చెందిన ఆటోను ధ్వంసం చేశారు. వీపరీతమైన రద్దీతో కిటకిటలాడే పంజాగుట్ట చౌరస్తాలో ఈ ఘోరం జరగడం హాట్ టాపికయింది.