Religious
తమలపాకులతో నాగదోష శాంతి
Kalinga Times:ఒకసారి సీతమ్మతల్లి అందించే తమలపాకుల చిలుకల్ని సేవిస్తున్న శ్రీరాముని వద్దక వచ్చిన ఆంజనేయుడు శ్రీరాముడిని ”స్వామీ ఏమిటది ? మీ నోరు అంత ఎర్రగా ఎందుకయ్యింది? అని అడిగాడు.అప్పుడు రాముడు ‘తమలపాకులు తింటే నోరు ఎర్రగా అవుతుంది. అంతేకాదు ఆరోగ్యానికి చాలా మంచిది అని చెప్పగానే వెంటనే ఆంజనేయుడు అక్కడి నుండి వెళ్లిపోయి కొంత సేపటికి ఒళ్లంతా తమల పాకులను కట్టుకొని గంతులు వేసుకుంటూ ఆనందంగా వచ్చాడు. స్వామివారు ఎక్కువగా తమలపాకు తోటలలోనూ,అరటి తోటలలోనూ విహరిస్తారు.
ఆంజనేయస్వామి రుద్ర సంభూతుడు. తమలపాకులు శాంతినిస్తాయి. అందువలన తమలపాకులతో పూజించడం వలన మనకు కూడా శాంతి, సుఖము లభిస్తాయి. తమలపాకులకు మరోపేరు నాగవల్లీ దళాలు. తమలపాకులతో పూజించడంవలన నాగదోష శాంతి కూడా జరుగుతుంది.
అంజనేయ స్వామిని తమలపాకులతో పూజించటం వలన అనేక ప్రయోజనాలు చేకూరుతాయి. అరటి తోటలో హనుమంతునికి పూజ కోటిరెట్లు ఫలితం వస్తుందని పెద్దలు చెబుతారు. శతవృద్ధ జిల్లేడు, తెల్లజిల్లేడు వేరు చెక్కతో హనుమంతుని ప్రతిమను చేయించి అరటితోటలో పూజించుట వలన సత్వరం హనుమంతుడు అనుగ్రహిస్తాడు. అరటి తోటలో హనుమంతునికి పూజ కోటిరెట్లు ఫలితాలను ఇస్తుంది.
అరటిపండ్ల నివేదన, సింధూర సమర్పణ, శని, మంగళవారములలో తమలపాకులతో పూజ హనుమంతుని ఆరాధనలో ముఖ్యమైనవి. హస్త,మృగశిర నక్షత్రములతో కూడిన ఆదివారాలు మారుతికి ఇష్టమైన రోజులు. భూత, ప్రేత పిశాచాది బాధలు, రోగాలు, కష్టాలు తొలగడానికి అభీష్టసిద్ధికి ఆంజనేయ ప్రదక్షిణములు శ్రేష్ఠం.
స్వామి మహిమలు పరాశర సంహిత, ఉమాసంహిత, హనుమ సంహిత తదితర గ్రంథాలు చెబుతున్నాయి. హనుమారాధన భోగ, మోక్షములను రెండింటినీ ఇస్తుంది. రామ భజన ఎక్కడ జరుగుతున్నా హనుమంతుడు వచ్చి కూర్చుంటాడని భక్తుల విశ్వాసం. ఆంజనేయుని చూసి మానవులు పట్టుదల కార్యదీక్షా దక్షత, మాట నేర్పు ఇలాంటివెన్నో తెలుసుకోవాలి.