
Kalinga Times, Hyderabad : తెలంగాణలో కరోనా సోకిన వారికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన సేవలను అందిస్తున్నామని ప్రైవేట్ ఆసుపత్రులకు ఎవరూ వెళ్లాల్సిన అవసరం లేదని సిఎం కెసిఆర్ తెలిపారు. కరోనా వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం ప్రగతి భవన్లో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. కరోనా మహమ్మారి గురించి ఎవరూ ఆందోళన చెందవచ్చని ఆయన అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ఎక్కువ మందికి చికిత్స అందుతోందని అన్నారు. కరోనాను ఎదుర్కొనే విషయంలో కేంద్రం గందరగోళంలో ఉండేదని అదే సమయంలో తెలంగాణలో పక్కా ప్రణాళికతో ముందుకెళ్లామని తెలిపారు. కరోనాతో సహజీవనం చేయక తప్పదని అన్నారు. తెలంగాణలో ఐసీఎంఆర్ నిబంధనల ప్రకారం కరోనా చికిత్సలను అందిస్తున్నామని చెప్పారు. కరోనాను ఎదుర్కోవడానికి రూ. 100 కోట్లను కేటాయించామని సిఎం కెసిఆర్ తెలిపారు.ఈ సమావేశానికి ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ముర్తాజా రిజ్వి, వివిధ శాఖల అధిపతులు పాల్గొన్నారు.