Andhra PradeshTelangana
సైలెంట్ వేవా… ప్రభుత్వ వ్యతిరేకతా

విజయవాడ, ఏప్రిల్ 13, (Local News India)
ఆంధ్రప్రదేశ్ లో ఓటర్లు పోటెత్తారు. దాదాపు 80 శాతం పోలింగ్ జరిగింది. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు సయితం మండుటెండను సయితం లెక్క చేయకుండా పోలింగ్ కేంద్రానికి తరలి వచ్చారు. ఇంతటి భారీ స్థాయిలో పోలింగ్ జరగడానికి రెండు ప్రధాన పార్టీలు తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు సైలెంట్ వేవ్ ఉందని చెబుతున్నాయి. ఎన్నడూ లేని విధంగా ఓటర్లు తరలి రావడానికి కారణాలేంటి? ప్రభుత్వంపై వ్యతిరేకతా? లేక అభివృద్ధి కొనసాగాలని ప్రభుత్వ అనుకూలతా? అన్నది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ముఖ్యంగా పసుపుకుంకుమ, పింఛన్లు వంటివి అమలు చేయడంతో మహిళలు, వృద్ధులు ఎండను సయితం లెక్క చేయకుండా క్యూలో నిల్చున్నారని తెలుగుదేశం పార్టీ లెక్క వేసుకుంటోంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సయితం ఊహించని వేవ్ ఉందని పేర్కొన్నారు. జగన్ అధికారంలోకి వస్తే అభివృద్ధి ఆగిపోతుందని భావించి మహిళలు, వృద్ధులతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి ఓటర్లు వచ్చారని ఆయన అన్నారు. ఇందులో కొంత నిజం లేకపోలేదంటున్నారు. జగన్ వస్తే సంక్షేమ పథకాలు నిలిచిపోతాయని ఆందోళన చెందే ఓటర్లు భారీ సంఖ్యలో వచ్చారన్నది టీడీపీ అభిప్రాయం.వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లెక్క వేరేలా ఉంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలన, జగన్ పాదయాత్ర వల్లనే జనం పోటెత్తారంటోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. జగన్ దాదాపు ఏడాదిన్నర పాటు ఎండనక, వాననక తమ గ్రామాలకు వచ్చారని, రాజన్న బిడ్డ అంత కష్టపడితే ఒక్కరోజు మనం ఓటు కోసం సమయం కేటాయించలేమా? అని మహిళలు, వృద్ధులు వచ్చారన్నది వైసీపీ లాజిక్ గా విన్పిస్తోంది. జగన్ పాదయాత్ర ప్రభావమే ఈ పోల్ పర్సంటేజ్ అన్నది వైసీపీ భావన. ప్రభుత్వ వ్యతరేకత ఉన్నప్పుడే ఇంతటి భారీ స్థాయిలో పోలింగ్ జరుగుతుందన్నది వైసీపీ వాదన.తెలంగాణలో జరిగిన ఎన్నికలతో పోల్చి చూస్తున్నారు టీడీపీ నేతలు. అక్కడ పోల్ పర్సంటేజ్ ఎక్కువ కావడం, అధికార పార్టీయే లబ్దిపొందడాన్ని గుర్తు చేస్తున్నారు తెలుగు తమ్ముళ్లు. కేసీఆర్ మాదిరిగానే తాము కూడా మ్యాజిక్ ఫిగర్ ను సులువగా చేరుకుంటామని చెబుతున్నారు. కానీ వైసీపీ మాత్రం తెలంగాణ పరిస్థితులు వేరని, ఇక్కడ ఐదేళ్లలో అభివృద్ది చేయకుండానే, ప్రజలకు మాయమాటలు చెప్పిన చంద్రబాబును ఓడించడానికే ప్రజలు పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చారంటున్నారు. ఎవరి లాజిక్ వాళ్లదే. జడ్జిమెంట్ లాక్ అయింది. మరి ఏం జరుగుతుందో చూడాలి.
బాబులో కాన్ఫిడెన్స్ లెవల్ తగ్గిందా
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఎన్నికలు పూర్తయిన అనంతరం తొలిసారి మీడియా ముందుకు వచ్చారు. అయితే చంద్రబాబు ప్రసంగమంతా ఈవీఎంల ట్యాంపరింగ్ మీదనే సాగింది. ఈవీఎంలలో ఉన్న చిప్స్ ను ప్రోగ్రామర్ మార్చే అవకాశముందని, ఎవరి వైపు విజయం ఉండాలో నిర్ణయించవచ్చని, ప్రోగ్రామర్ ఎలా చెబితే అలా నడుచుకుంటుందని తెలిపారు. జగన్, కేసీఆర్, మోదీలు కుమ్మక్కై ఏపీలో కుట్రలు చేయడానికి ప్రయత్నించారన్నారు.దాదాపు రెండుగంటల పాటు సాగిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాత్రం ఎన్ని సీట్లు గెలుస్తామన్న దానిపై సమాధానాన్ని దాటవేశారు. మీరే చూస్తారు కదా? అని మాత్రం చెప్పారు. తమ పార్టీకి సైలెంట్ వేవ్ ఉందని, జగన్ ను చూసి పోలో మంటూ జనం పోలింగ్ కేంద్రాలకు తరలి రారన్నారు. ఆయనలో ఏం చూసి ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్దకు పోటెత్తుతారని ప్రశ్నించారు. ఎన్నికల ఫలితాల కంటే ముందే ఈవీఎంలపై పోరాటం చేయాల్సి ఉందన్నారు.చంద్రబాబు మీడియా సమావేశంలో కొంత ఆందోళనగానే కన్పించారు. టీడీపీకి విజయావకాశాలపై స్పష్టంగా చెప్పలేకపోయారు. దీంతో పాటు ఎక్కువగా తనపైన, రాష్ట్రంపైన కుట్రలు జరిగాయన్నారు తప్పించి తమ అభ్యర్థుల విజయావకాశాల మీద మాట్లాడకపోవడంతో టీడీపీ నేతల్లోనూ కొంత భయం పట్టుకుంది. పోలింగ్ కేంద్రాలకు వచ్చిన మహిళలు, పెన్షన్లు తీసుకున్న వృద్ధుల ఓట్లు మాత్రం తమకు అనుకూలంగానే ఉంటాయని చంద్రబాబు వారికి మీడియా సమావేశంలోనే కృతజ్ఞతలు చెప్పారు. మొత్తం మీద చంద్రబాబు మీడియా సమావేశంతో టీడీపీ వర్గాల్లో నైరాశ్యం అలుముకుంది. గెలుపుపై ఖచ్చితమైన కామెంట్స్ చేయకపోవడానికి కారణాలేంటా? అని టీడీపీ నేతలు అన్వేషిస్తున్నారు.