ఉడిపితో సహా మిగిలిన అయిదు క్షేత్రాలు ఉత్తర కర్ణాటకలో సాగర తీరంలో ఉండగా ఈ ఒక్క క్షేత్రం దూరంగా దక్షిణ కర్ణాటకలో ఉంటుంది. ఈ దివ్యక్షేత్ర పురాణగాధ సత్య యుగం నాటిది. లోకకంటకులైన తారకాసుర మొదలైన రాక్షసులను సంహరించిన శివ కుమారునికి దేవేంద్రుని కుమార్తె అయిన దేవసేనతో మార్గశిర శుద్ధ షష్టినాడు ఇక్కడే వివాహం జరిగిందని అంటారు. స్కందునికి మంగళ స్నానం చేయించడానికి దేవతలు అనేక పవిత్ర నదీ జలాలను తెచ్చారు.
ఆ జలాల ప్రవాహమే నేటి కుమార ధార. జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్య కుక్కే క్షేత్రాన్ని సందర్శించినట్లుగా శంకర విజయం తెలుపుతోంది. కుక్కె నాగదోష పూజలకు ప్రసిద్ధి. గరుడుని వలన ప్రాణ భయం ఏర్పడటంతో సర్ప రాజు వాసుకి ఇక్కడ దాక్కొని సర్వేశ్వరుని గురించి తపము చేసాడు. కుమారస్వామి తన వివాహ సందర్భంగా తండ్రి ఆదేశం మేరకు నాగారాజుకి అభయమిచ్చారు. ఇద్దరూ కలిసి ఇక్కడ కొలువైనారు. అందువలన ఇక్కడ చేసే పూజలు నాగ దోషాన్ని తొలగిస్తాయి. భక్తులు వివాహం, సంతానం, ఆరోగ్యం కోసం ఇక్కడికి వస్తుంటారు. నాగప్రతిష్టలు చేస్తుంటారు. కుమారధారలో స్నానం చేయడం వలన కుష్టు వ్యాధి లాంటివి కూడా తగ్గుతాయని విశ్వసిస్తారు. ప్రతి నిత్యం వేలాది మందికి అన్నదానం జరుగుతుందిక్కడ.