
Kalinga Times, Madurai: దేవాదాయ శాఖ పరిధిలో మదురై చదురగిరి సుందర మహాలింగ ఆలయం లో హుండీ కానుకలు లెక్కించేందుకు విధి నిర్వహణలో భాగంగా ఓ మహిళా అసిస్టెంట్ ఆఫీసర్ జూన్ 28వ తేదీన అక్కడకు వచ్చారు. మరునాడు కూడా ఉండాల్సి రావడంతో ఆ రాత్రికి అక్కడే ఉన్న వీఐపీ వసతిగృహంలో బస చేశారు. మరుసటి రోజు ఉదయం ఆమె బాత్రూమ్లో స్నానం చేసి బయటకు వచ్చే సమయంలో పురుషుల వస్త్రాలు కనిపించాయి. ఆమెకు అనుమానం వచ్చి వాటిని నిశీతంగా పరిశీలిస్తే అందులో రెండు సెల్ఫోన్లు బయటపడ్డాయి. అందులో ఒక సెల్‌ఫోన్ ఆమెను వీడియో తీసేలా ఫిక్స్ చేసి ఉంది. ఆ ఫోన్ తీసుకుని చూడగా కెమెరా ఆన్ చేసి ఉన్న విషయం తెలిసింది. దాంతో ఆమె అనుమానం బలపడి బాత్రూమ్లోనూ చెక్ చేశారు. అక్కడ కూడా పెన్ కెమెరాలు అమర్చి ఉన్నాయి. అక్కడి నుంచి మౌనంగా వెళ్లిపోయిన సదరు మహిళా అధికారి ఇంటికి వెళ్లాక తన ల్యాప్‌టాప్‌లో ఆ కెమెరాల్లోని మెమొరీ కార్డులు వేసి చూశారు. అందులో తనతో పాటు మరో మహిళా ఉద్యోగి స్నానం చేస్తున్న దృశ్యాలు రికార్డయ్యాయి. వెంటనే చెన్నైలో ఉండే దేవాదాయ శాఖ కార్యాలయంతో పాటు మదురై డీఐజీకి ఫిర్యాదు చేశారు. ఆమె కంప్లైంట్‌తో రంగంలోకి దిగిన పోలీసులకు విస్తుపోయే నిజాలు తెలిశాయి. సదరు మహిళా అధికారి బస చేసిన గది పక్కనే మరో గదిలో బస చేసిన ఉన్నతాధికారి ఆ పని చేసినట్లు గుర్తించారు. దేవాదాయ శాఖ జోనల్ జాయింట్ కమిషనర్ పచ్చయప్పన్ ఈ పాడుపనికి పాల్పడ్డాడని తేల్చారు. దాంతో కేసు నమోదు చేసి అతడిని అరెస్ట్ చేశారు.