Andhra Pradesh
మంత్రులకు అంత వీజీగా లేదే…
విజయవాడ, మార్చి 23 (Local News India)
ఏపీలో ఎన్నికల పోలింగ్ కు మరో 18 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో అన్ని పార్టీల అభ్యర్ధులు ఉధృతంగా ప్రచారం సాగిస్తున్నారు. అయితే అన్ని నియోజకవర్గాల్లోనూ అభ్యర్ధుల విజయావకాశాలపై గతంలో ఎన్నడూ లేనంత స్ధాయిలో చర్చ సాగుతోంది. ఇదే కోవలో చంద్రబాబు కేబినెట్ లో ప్రస్తుతం మంత్రులుగా ఉన్న వారి తాజా పరిస్ధితి ఏమిటన్న దానిపై సగటు ఓటరులో ఉత్కంఠ నెలకొంటోంది. చంద్రబాబు కేబినెట్ లో మంత్రులుగా ఉన్న వారిలో సగానికి పైగా మంత్రులకు ఈసారి ఎదురీత తప్పేలా లేదు. కోస్తా, రాయలసీమ జిల్లాల్లో పోటీ చేస్తున్న పలువురు మంత్రులకు గడ్డు పరిస్ధితులు ఎదురవుతున్నాయి. వైసీపీతో పాటు జనసేన పార్టీకి చెందిన ప్రత్యర్థులు ఆయా నియోజకవర్గాల్లో మంత్రులకు గట్టి సవాల్ విసురుతున్నారు. కృష్ణాజిల్లా మైలవరంలో మంత్రి దేవినేని ఉమ, తిరువూరులో మంత్రి జవహర్, తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో డిప్యూటీ సీఎం చినరాజప్ప, పశ్చిమగోదావరి జిల్లా ఆచంటలో మంత్రి పితాని సత్యనారాయణ, నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ప్రకాశం జిల్లా ఒంగోలు ఎంపీ సీటులో శిద్ధా రాఘవరావు, కడప ఎంపీ సీటులో మంత్రి ఆదినారాయణరెడ్డి వంటి వారు ఈ జాబితాలో ఉన్నారు.
కృష్ణాజిల్లా మైలవరం నుంచి వరుసగా రెండుసార్లు గెలిచిన మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఈసారి తన సొంత సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు తనయుడు వసంత కృష్ణప్రసాద్ నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. నియోజకవర్గంలో తీవ్ర ప్రజావ్యతిరేకత ఎదుర్కొంటున్న మంత్రి ఉమ… అభివృద్ధి విషయంలోనూ అంతంతమాత్రంగానే ఉన్నారు. దీంతో ఈసారి వసంత కుటుంబాన్ని ఎదుర్కొనేందుకు దేవినేని ఉమ చెమటోడుస్తున్నారు.
పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు నుంచి గత ఎన్నికల్లో గెలిచిన మరో మంత్రి కేఎస్ జవహర్… ఈసారి కృష్ణాజిల్లా తిరువూరులో పోటీ చేస్తున్నారు. కొవ్వూరులో ప్రజా వ్యతిరేకతతో పాటు సొంత పార్టీ నేతల నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటున‌్న జవహర్ కు తిరువూరు స్వస్ధలం అన్న ఏకైక కారణంతో చంద్రబాబు టికెట్ కేటాయించారు. అప్పటికే నియోజకవర్గంలో ఇన్ ఛార్జ్ గా ఉన్న స్వామిదాస్ టికెట్ రాలేదన్న అసంతృప్తిగా ఉన్నారు. దీంతో స్వామిదాస్… జవహర్ కు ఏమేరకు సహకరిస్తారన్నది అనుమానమే. చంద్రబాబు అభివృద్ధి అజెండాను నమ్ముకుని జవహర్ ఇక్కడ పోరాడుతున్నారు.
ఇక తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో వరుసగా రెండోసారి పోటీ చేస్తున్న డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్పకు ఈసారి సొంత పార్టీలోనే తలనొప్పులు ఎదురవుతున్నాయి. పెద్దాపురంలో టికెట్ ఆశించి భంగపడ్డ స్ధానిక నేత బొడ్డు భాస్కరరామారావు చినరాజప్పపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. ఈసారి ఎన్నికల్లో ఎట్టి పరిస్ధితుల్లోనూ చినరాజప్పకు సహకరించేది లేదని ఆయన చెబుతున్నారు. పెద్దాపురంలో ఈసారి వైసీపీ ఈసారి కాకినాడ మాజీ ఎంపీ తోట నర్సింహం భార్య తోట వాణిని బరిలోకి దింపింది. దీంతో ఈసారి సొంత పార్టీ నేతలతో పాటు తోట వాణి నుంచి చినరాజప్పకు గట్టి ప్రతిఘటన ఎదురవుతోంది.
పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన మంత్రి పితాని సత్యనారాయణ గత ఎన్నికల్లో గెలిచిన ఆచంట నుంచే మరోసారి బరిలోకి దిగారు. అయితే ఇక్కడ ఈ మధ్యే వైసీపీలో చేరిన జిల్లా రైసు మిల్లుల సంఘం అధ్యక్షుడు చెరుకువాడ శ్రీరంగనాథ రాజు ఆయనకు గట్టిపోటీ ఇస్తున్నారు. ప్రభుత్వంపై సహజంగా ఉండే వ్యతిరేకతకు తోడు నియోజకవర్గంలో అభివృద్ధి జాడలు కనిపించకపోవడం, జనసేన నుంచి అభ్యర్ధి కూడా రంగంలో ఉండటంతో ఈసారి పితానికి చిక్కులు తప్పేలా లేవు.
నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో వరుసగా మూడుసార్లు ఓటమి పాలైన మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎమ్మెల్సీ సీటుతో చంద్రబాబు కేబినెట్ లో చోటు దక్కించుకున్నారు. వరుసగా నాలుగోసారి ఆయన ఇక్కడ నుంచి బరిలోకి దిగుతున్న సోమిరెడ్డికి సొంత సామాజికవర్గం నుంచే మద్దతు లేకపోవడం, గతంలో ఆయనపై ఇక్కడ గెలిచిన ఆదాల ప్రభాకర్ రెడ్డి వైసీపీ తరఫున ఎంపీగా పోటీ చేస్తుండటంతో ఎదురీత తప్పడం లేదు. అయినా చంద్రబాబు ప్రభుత్వ పథకాల అండతో ఈసారి గట్టెక్కాలన్నది ఆయన వ్యూహంగా ఉంది. నెల్లూరు జిల్లాలో వైసీపీ బలంగా ఉండటం, టీడీపీలో అంతర్గత పోరు సోమిరెడ్డిని చికాకు పెడుతున్నాయి.
గత ఎన్నికల్లో ప్రకాశం జిల్లా దర్శిలో విజయంతో చంద్రబాబు కేబినెట్ లో స్ధానం దక్కించుకున్న శిద్ధా రాఘవరావు.. ఈసారి అయిష్టంగానే ఒంగోలు ఎంపీగా బరిలోకి దిగారు. జిల్లాలో పలుకుబడి ఉన్న మాగుంట కుటుంబం నుంచి శ్రీనివాసులరెడ్డి వైసీపీ నుంచి శిద్ధాకు గట్టి పోటీ ఇస్తున్నారు. శిద్ధాతో పోలిస్తే మాగుంటకే ఇక్కడ గెలుపు అవకాశాలు ఉన్నాయనేది సుస్పష్టం. ఒంగోలు ఎంపీ సీటు పరిధిలో వైసీపీ ఎమ్మెల్యేల బలం మాగుంటకు ప్లస్ కానుండగా… దర్శిలో తన కుటుంబీకులకు కూడా సీటు ఇప్పించుకోలేని నిస్సహాయత మంత్రి శిద్ధాకు మైనస్ గా మారింది. ఒంగోలు ఎంపీ సీటులో ఓడినా భవిష్యత్తుపై చంద్రబాబు హామీ ఇవ్వడంతో బరిలోకి దిగిన శిద్ధా రాఘవరావుపై జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యేలు సైతం పెదవి విరుస్తున్నారు.
వైఎస్ కుటుంబానికి గట్టి పట్టున్న కడప ఎంపీ సీటు నుంచి తొలిసారి బరిలోకి దిగిన మంత్రి ఆదినారాయణరెడ్డికి ఇక్కడ గట్టి పోటీ ఎదురవుతోంది. వైఎస్ కుటుంబానికి చెందిన యువనేత, సిట్టింగ్ ఎంపీ అవినాష్ రెడ్డి ఆయనకు గట్టి సవాల్ విసురుతున్నారు. 1952లో నియోజకవర్గం ఏర్పడ్డాక ఒకే ఒకసారి టీడీపీ ఎంపీ గెలిచిన ఈ స్ధానంలో అనివార్య పరిస్ధితుల్లో బరిలోకి దిగిన మంత్రి ఆదినారాయణరెడ్డి… ఈసారి విజయం కోసం చెమటోడుస్తున్నారు. ఆది విజయంపై టీడీపీ అధిష్టానానికి సైతం ఆశలు లేకపోయినా.. వైఎస్ కుటుంబానికి గట్టి పోటీ ఇచ్చే మరో అభ్యర్ధి లేకపోవడం, జమ్మలమడుగులో రామసుబ్బారెడ్డితో ఒప్పందంలో భాగంగా ఆదిని బరిలోకి దింపారు.