Nationalsocial

10 నెలల్లో 7 కోట్ల డెబిట్‌ కార్డులు

ముంబై, మార్చి 22 (Local News India)
దేశంలో ఏటీఎం/డెబిట్ కార్డుల వాడకం రోజురోజుకు పెరిగిపోతోంది. బ్యాంకులు డెబిట్ కార్డులను భారీగానే జారీ చేస్తున్నాయి. అయితే దీనికి తగినట్లుగా ఏటీఎంల విస్తరణ మాత్రం అంత వేగంగా జరగడం లేదు. ఇప్పటికే ఉన్న ఏటీఎంలు కూడా సరిగా పనిచేయవు. వీటిల్లో తగినంతగా డబ్బు అందుబాటులో ఉండటం లేదు. ఫలితంగా ఖాతాదారులు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి 10 నెలల కాలంలో (ఏప్రిల్‌-జనవరి) బ్యాంకులు దాదాపు 7 కోట్ల డెబిట్‌ కార్డులను జారీ చేశాయి. దీంతో మొత్తం డెబిట్‌ కార్డుల సంఖ్య 93 కోట్లకు చేరింది. ఇదే పది నెలల్లో ఏటీఎంల సంఖ్య 399 తగ్గింది. ఉన్న ఏటీఎంలలో డబ్బులు తొందరగానే అయిపోతుండటం వల్ల కస్టమర్లు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. బ్యాంకులు ఇప్పటికే మొండిబకాయిలతో సతమతమౌతున్నాయి. ఈ తరుణంలో ఏటీఎంల కోసం మళ్లీ ఖర్చు చేసే పరిస్థితి లేదని తెలుస్తోంది. కొన్ని చోట్ల ఏటీఎంల నిర్వహణ వల్ల బ్యాంకులపై అదనపు భారం పడుతోందట. దీన్ని దృష్టిలో ఉంచుకుని వాటిని బ్యాంకులు మూసివేస్తుండటం వల్ల ఏటీఎంల సంఖ్య తగ్గుతోందని తెలుస్తోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. గత ఏడాది నుంచి ఏటీఎంల సంఖ్య అంతగా పెరగడం లేదని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పథకాల కింద ప్రజలకు ఇస్తున్న సొమ్ము నేరుగా బ్యాంకు ఖాతాల్లోనే పడుతోంది. ఈ సొమ్ము కోసం బ్యాంకుల చుట్టూ తిరగడం చాలా మందికి ఇబ్బందికరంగా మారుతోంది. ఇదే సమయంలో ఏటీఎం సంఖ్య తగ్గుతుండటం వల్ల ఖాతాదారులకు కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తోంది. అయితే యువత మాత్రం ఏటీఎంల చుట్టూ తిరగకుండా మొబైల్‌ అప్లికేషన్ల ద్వారా డిజిటల్‌ లావాదేవీలను నిర్వహిస్తూ కొంత వరకు ఉపశమనం పొందుతున్నారు.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close