National

దూకుడుగా కమలం…డోలాయామానంలో కాంగ్రెస్

న్యూఢిల్లీ, మార్చి 16, (Local News India)
ఎన్నికలు, పొత్తుల అంశంలో బీజేపీ దూకుడుగా ముందుకు సాగుతోంది. కాంగ్రెస్ మాత్రం వెనుకబడి పోయింది. దేశవ్యాప్తంగా బీజేపీ పొత్తులు కుదుర్చుకుంటుంటే.. కాంగ్రెస్ మాత్రం తమిళనాడు, కర్ణాటకతోనే సరిపుచ్చుకుంది. మిత్రులతో సయోధ్యగా ముందుకు సాగుతోంది. బిహార్ లో తన సిట్టింగ్ సీట్లనే ఒదులుకుంది. గత ఎన్నికల్లో గెలుచుకున్న 22 సీట్లలో ఐదు సీట్లను మిత్రులకు వదులుకొని 17 సీట్లలోనే బీజేపీ పోటీ చేస్తోంది. అదే విధంగా నిత్యం విమర్శలు ఆరోపణలు చేస్తున్న శివసేనతో ముందస్తుగా పొత్తు కుదుర్చుకొని సీట్లను ఖరారు చేసుకున్నారు. అదే విధంగా కాంగ్రెస్ ను తుడిచిపెట్టేందుకు గతంలో ఏర్పాటు చేసిన నార్త్ ఈస్ట్ డెమోక్రటిక్ అలయన్స్(ఎన్ డీఏ)ను విచ్చీన్నం కాకుండా జాగ్రత్తలు తీసుకుంది. పొత్తు అంశంలో బీజేపీ సర్దుకుపోయే ధోరణితో ముందుకు సాగుతుంటే.. కాంగ్రెస్ పట్టుదలకు పోయి మిత్రులను దూరం చేసుకుంటోంది. ప్రచారంలోనూ బీజేపీ వేగంగా ముందుకు దూసుకొని పోతుంటే.. కాంగ్రెస్ ఇంకా వేగమే పుంజుకోలేదు. లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడక ముందే పొత్తుల అంశంలో బీజేపీ ముందుచూపుతో వ్యవహరించింది. దేశవ్యాప్తంగా ఎక్కడి పొత్తులు ఖరారు చేసుకున్నది. దక్షిణాదిలోని తమిళనాడు, ఈశాన్య రాష్ట్రాల్లో పొత్తులు, బిహార్, మహారాష్ట్రలో మిత్రపక్షాలకు కొంత తలొగ్గి.. పొత్తులు కుదుర్చుకున్నది. తమిళనాడులో డీఎంకే, డీడీఎంకే, పీఎంకే వంటి పార్టీలు, మహారాష్ట్రలో శివసేన, బిహార్ లో జనతాదళ్ (యూ) పొత్తులు కుదుర్చుకున్నది. ఈశాన్య రాష్ట్రాల్లోని నేషనల్ పీపుల్స్ పార్టీ , నేషనల్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ, అసోం గణ పరిషత్, బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్, క్రాంతికారి మోర్చాతో, పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర వంటి పార్టీలతో కలిసి ఏర్పాటు చే సిన నార్త్ ఈస్ట్ డెమోక్రటిక్ అలయన్స్(ఎన్ ఈ డీఏ) కొనసాగేలా చర్యలు తీసుకుంది. ఈశాన్య రాష్ట్రాల్లో కాంగ్రెస్ కు చెక్ పెట్టడమే లక్ష్యంగా బీజేపీ ఏర్పాటు చేసిన కూటమి కేంద్ర ప్రభుత్వం తెచ్చిన పౌరసత్వ సవరణ బిల్లుతో బీటలు బారే స్థితికి చేరుకుంది. అసోంలో ఏకంగా బీజేపీ సంకీర్ణ ప్ర భుత్వం నుంచి అసోం గణపరిషత్ వైదొలిగింది. మేఘాలయలోని పలు పార్టీలు తాము బీజేపీతో తెగదెంపులు చేసుకుంటామని ప్రకటించాయి. అయితే లోక్ సభ ఎన్నికల షెడ్యూలు విడుదలైన నేపథ్యంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాంమాధవ్ రంగంలోకి పరిస్థితిని చక్కదిద్దారు.ఆయా పార్టీ నేతలతో చర్చలు జరిపారు. ఏజీపీ నేతలనూ తిరిగి కూటమిలో కొనసాగేలా ఒప్పించారు. సిక్కిం క్రాంతికారి మోర్చాతో, త్రిపురలో పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపురతోనూ సంప్రదింపులు జరపడం ద్వారా ఎన్ డీ ఏ కొనసాగేలా జాగ్రత్తలు తీసుకున్నారు. పొత్తుల వ్యవహారంలో కాంగ్రెస్ డీలా పడింది. తమిళనాడు, కర్ణాటక తప్ప మరే రాష్ట్రంలోనూ పొత్తులు కుదుర్చుకోలేక పోయింది. మహారాష్ట్రలో ఎన్సీపీతో ఇంకా సంప్రదింపుల స్థాయిలోనే ఉంది. ఢిల్లీలో పొత్తు కుదుర్చుకోవడానికి ఆమ్ ఆద్మీ పార్టీ ముందుకు వచ్చినా.. ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నాయకురాలు షీలా దీక్షిత్ పొత్తు కుదరకుండా అడ్డుపుల్ల వేశారు. దీంతో ఆప్ అన్ని స్థానాల్లో ఒంటరిగా పోటీ చేస్తోంది. పశ్చిమబెంగాల్ లో వామపక్షాలతో పొత్తు కుదురుకోకుండా కాంగ్రెస్ అడ్డుపుల్ల వేసుకుంది. 2021లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు కుదుర్చుకోవడానికి వామపక్షాలు అంగీకరిస్తే.. ఇప్పుడు పొత్తు కుదుర్చుకుంటామని కాంగ్రెస్ విధించిన షరతుతో వామపక్షాలు సొంతంగానే పోటీకి దిగడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్తో పొత్తు కుదుర్చుకోవడానికి వెంటపడ్డ ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పుడు ముఖం చాటేశారు.ఏపీ ఎన్నికల్లో పొత్తు ఉండదని తేల్చి చెప్పారు. ఇక తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. గత డిసెంబర్ లో కాంగ్రెస్ తరుపున గెలిచిన ఎమ్మెల్యేల్లో అనేక మంది టీఆర్ఎస్ లో చేరిపోతున్నారు. ఇక ఆ పార్టీలో ఎంతమంది ఎమ్మెల్యేలు మిగులుతారో చెప్పడమే కష్టంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్న సీపీఐ, టీజేఎస్ ఈసారి జనసేనతో వెళ్తున్నాయి. ఎంపీ టికెట్లకు కూడ పెద్దగా గిరాకీ లేకుండా పోయింది. ఎన్నికల్లో గెలుపు ఓటములను నిర్ణయించే పొత్తుల విషయంలో వెనుకబడిన కాంగ్రెస్ లోక్ సభ ఎన్నికల్లో ఏ విధంగా ముందుకు సాగుతుందో అర్ధం కాని పరిస్థితి నెలకొంది. పొత్తుల అంశంలో ఇప్పటికైనా కాంగ్రెస్ అధిష్ఠానం ఏదైనా నిర్ణయం తీసుకుంటుందేమో చూడాలి. చివరకేమిటంటే.. పొత్తులు కుదుర్చుకోవడంలో కాంగ్రెస్ ఓడిపోయింది. బీజేపీ గెలిచింది. ఎన్నికల ప్రచారంలో కూడా బీజేపీ వేగంగా దూసుకొని పోతోంది. ఆ పార్టీ తరుపున ప్రధాని మోదీ, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ ఇలా చెప్పుకుంటే పోతే అనేక మంది ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకముందే.. దేశాన్ని చుట్టుముట్టేశారు. ఆర్ఎస్ఎస్ అండ ఉండనే ఉంది. కాంగ్రెస్ తరుపున రాహుల్ ఒక్కడే నిర్వహిస్తున్నారు. ప్రియాంక రంగ ప్రవేశం చేసినా.. ఇంకా వేగం పుంజుకోలేదు. వీరిద్దరు తప్ప ఆ పార్టీలో ఛరిస్మా కలిగిన నేతలు పెద్దగా లేరు.జ్యోతిరాదిత్య సింథియాను ఉత్తర ప్రదేశ్ బాధ్యతలు అప్పగించారు. రెండు రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో పాటు మొదటి దశ ఎన్నికలు జరిగే రాష్ట్రాల నామినేషన్ల దాఖలు ప్రారంభం కానుంది. మొదటి దశ ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు సంబంధించి అభ్యర్థుల జాబితాను విడుదల చేయడానికి బీజేపీ సర్వం సిద్ధమవుతోంది.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close