social
రీల్ లైఫ్ లో మామా అల్లుళ్లు
రాజమండ్రి, ఫిబ్రవరి 25 (LOCAL NEWS INDIA)
రియల్ లైఫ్‌లో మామా అల్లుళ్లు అయిన వెంకటేశ్, నాగచైతన్య ఇప్పుడు రీల్ లైఫ్‌లోనూ అవే పాత్రల్లో కనిపించబోతున్నారు. వీరిద్దరి కాంబినేషన్‌లో రూపొందుతోన్న మల్టీస్టారర్ మూవీ ‘వెంకీ మామ’. ‘జైలవకుశ’ ఫేమ్ కె.ఎస్.రవీంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిల్మ్ కార్పోరేషన్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. సురేష్ బాబు, విశ్వప్రసాద్, కోన వెంకట్ నిర్మాతలు. ఈ సినిమా తొలి షెడ్యూల్ షూటింగ్ ప్రారంభమైంది. రాజమండ్రి సమీపంలోని గోదావరి పరిసరాల్లో తొలి రోజు షూటింగ్ చేశారు. తొలి రోజు షూటింగ్‌లో వెంకటేశ్‌తోపాటు చైతన్య పాల్గొన్నారు. ఇద్దరు స్టార్ హీరోలు షూటింగ్ నిమిత్తం రాజమండ్రికి రావడంతో అక్కడ పండగ వాతావరణం నెలకొంది. ఈ చిత్రంలో వెంకటేశ్ సరసన ‘ఆరెక్స్100’ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్, నాగ చైతన్య సరసన రాశీఖన్నా నటిస్తున్నారు. ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి తమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. కాగా, గోదావరి తీరంలో షూటింగ్‌ను ప్రారంభించినట్లు దర్శకుడు బాబీ ట్వీట్ చేశారు. ‘గోదావరి నదీ తీరంలో వెంకటేశ్ గారు, నాగ చైతన్యలతో తొలి రోజు షూటింగ్ మొదలుపెడుతున్నామని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాను. మాకు మీ అందరి దీవెనలు కావాలి. కృతజ్ఞతలు’ అని బాబీ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. గోదావరి తీరంలో కొబ్బరి తోటల మధ్య గుడి పక్కన వేసిన షూటింగ్ సెట్‌కు సంబంధించిన ఫొటోను కూడా షేర్ చేశారు.