Telangana
డిప్యూటీ స్పీకర్ గా పద్మారావు
హైదరాబాద్, ఫిబ్రవరి 25, (LOCAL NEWS INDIA)
తెలంగాణ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. డిప్యూటీ స్పీకర్ ఎన్నికలో భాగంగా శనివారం నామినేషన్ల దాఖలుకు గడువు ముగిసే సమయానికి పద్మారావు గౌడ్ ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. దీంతో డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవమైంది. సోమవారం ఉదయం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన అనంతరం స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, పద్మారావు డిప్యూటీ స్పీకర్ అని అధికారికంగా ప్రకటించారు. ఎన్నిక అనంతరం ఈ సందర్భంగా పద్మారావుగౌడ్ ను సీఎం కేసీఆర్, దానం నాగేందర్, కాంగ్రెస్ సీఎల్పీ నేత భట్టీ విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు, ప్రతిపక్ష సభ్యులు కలిసి అభినందనలు తెలియజేశారు. డిప్యూటీ స్పీకర్ గురించి కేసీఆర్ మాట్లాడుతూ.. గత 20 సంవత్సరాల నుంచి పద్మారావుతో ఉన్న అనుబంధం మరిచిపోలేనిదన్నారు. ఉద్యమ సందర్భంలో మీరు కనబరిచినవంటి ఏకాగ్రత, దీక్ష, పట్టుదల ఎన్నిజన్మలెత్తినా మరిచిపోయేది కాదని కేసీఆర్ వ్యాఖ్యానించారు. జంట నగరాల నుంచి ఉద్యమాన్ని నడిపిన నాయకుడు పద్మారావు. పద్మారావు ప్రజలతో మమేకమయ్యే తీరు అందరికి ఆదర్శం. 2014 లో అబ్కారీ శాఖ మంత్రిగా పద్మారావు హయాంలో లక్షలాది ఈత, తాటి మొక్కలు నాటారు. కల్లుగీత కార్మికులకు చెట్ల పన్ను రద్దు చేశారు. పదవిలో ఉన్నా లేకున్న ఆయన ఒకేలా ఉంటారు. భవిష్యత్లో పద్మారావు గౌడ్ ఉన్నత పదవులు అధిరోహించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను అని సీఎం కేసీఆర్ అన్నారు.
ప్రతిపక్ష నేత మల్లు భట్టివిక్రమార్క పద్మారావును అభినందించారు. అయన మాట్లాడుతూ అందరూ మెచ్చేలా సభ నడుపుతారని ఆశిస్తున్నానన్నారు. మీరు తీసుకున్న నిర్ణయాలు అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. సభ్యుల హక్కుల్ని కాపాడాలని కోరుతున్నానన్నారు